ప్రభుత్వ చేతగానితనం వల్లే రాష్ట్ర రాబడి పడిపోయింది: చంద్రబాబు

ప్రభుత్వ చేతగానితనం వల్లే రాష్ట్ర రాబడి పడిపోయింది: చంద్రబాబు

వైసీపీ ప్రభుత్వ చేతకానితనం వల్లే పెట్టుబడులు రాష్ట్రానికి రావడం లేదని.. వస్తాయనుకున్న పెట్టుబడులు తరలి పోతున్నాయని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. ఇప్పటికే ఒక లక్ష 80 వేల కోట్ల రూపాయల మేర పెట్టుబడులు ఆగిపోయాయని ఆయన విమర్శించారు. రిలయన్స్, అదానీ, కియా ఆగ్జిలరీ యూనిట్లు, ఫ్రాంక్లిన్ టెంపుల్‌టన్‌ వంటి సంస్థలను రాష్ట్రం నుంచి తరిమేశారని చంద్రబాబు ఆరోపించారు. అనంతపురం జిల్లాలోని కియా మెయిన్‌ ప్లాంటు కూడా తమిళనాడుకు తరలిపోతోందని చంద్రబాబు అన్నారు.

టీడీపీ నాయకులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబు నాయుడు.. వైసీపీ ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేశారు. ఏపీలో వైసీపీ నాయకుల దాడులకు, అవినీతికి.. పారిశ్రామికవేత్తలు భయాందోళనకు గురవుతున్నారని అన్నారాయన. ఇతర రాష్ట్రాల్లో అవినీతి వల్లే తాము ఏపీకి వచ్చినట్టు గతంలో కియా ప్రతినిధులు తనతో చెప్పారని చంద్రబాబు గుర్తుచేశారు. అలాంటిది.. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో అవినీతిని చూసి.. భయపడి ఇతర రాష్ట్రాలకు తరలిపోతున్నారని అన్నారు. నెంబర్‌వన్‌గా ఉన్న రాష్ట్రాన్ని చివరాఖరకు తీసుకెళ్లారని చంద్రబాబు ఆవేదన వ్యక్తంచేశారు. మింట్‌ సర్వేలో ఏపీ 24వ స్థానంలో ఉందని గుర్తుచేశారు. ద్రవ్యోల్బణం 7శాతం పెరిగిపోయిందని, కొనుగోలు శక్తి 69 శాతం పడిపోయిందని అన్నారు.

అభివృద్ధిలోనే కాదు.. సంక్షేమం విషయంలోను వైసీపీ ప్రభుత్వం విఫలం అవుతోందని చంద్రబాబు విమర్శించారు. రాష్ట్రంలో 7 లక్షల మందికి పెన్షన్లు తొలగించారని అన్నారు. వాళ్లందరికీ తిరిగి పెన్షన్లు వచ్చేలా టీడీపీ పోరాటం చేయాలని తమ్ముళ్లకు పిలుపునిచ్చారు. వృద్ధులు, వికలాంగుల పింఛన్ల నుంచి 500 రూపాయల చొప్పున గ్రామ వాలంటీర్లు వసూలు చేయడం సిగ్గుచేటని విమర్శించారు. వైసీపీ కార్యకర్తలకే వాలంటీర్ ఉద్యోగాలు వచ్చాయని.. గతంలో ఆ పార్టీ ఎంపీ చెప్పిన విషయాన్ని చంద్రబాబు గుర్తుచేశారు. సోమవారం పింఛన్లపై అన్ని మండలాల్లో ఆందోళనలు చేయాలని.. స్పందన కార్యక్రమంలో వినతులు అందించాలని టీడీపీ కార్యకర్తలకు అధినేత సూచించారు.

ఆంధ్రప్రదేశ్‌లో పనిచేయాలంటే అధికారులు సైతం భయపడిపోతున్నారని చంద్రబాబు అన్నారు. ఒక మహిళాధికారిపై ఫైళ్లు విసిరేశారని, మరో అధికారిని కొట్టి దౌర్జన్యం చేశారని ఆరోపించారు. ఎప్పుడేం చేస్తారో అనే భయం అందరిలో ఉందని విమర్శించారు. ప్రశ్నించిన వారిపై దౌర్జన్యాలకు పాల్పడ్డం దుర్మార్గం అన్నారాయన. భయం గుప్పిట్లో రాష్ట్రం బతుకుతోందని చంద్రబాబు ఆవేదన వ్యక్తంచేశారు. ఈ పరిస్థితి మారాలన్నారు. జైఅమరావతి అన్నందుకు నలుగురు నాగార్జున యూనివర్సిటీ విద్యార్థులను సస్పెండ్ చేయడం దుర్మార్గం అన్నారు చంద్రబాబు. ఇదేం పద్ధతని ప్రశ్నించేందుకు వెళ్లిన జేఏసీ నేతలను లోపలకు అనుమతించలేదని అన్నారు. వీటన్నింటిపై యువతను చైతన్యం చేయాలని చంద్రబాబు నాయుడు.. తమ పార్టీ నాయకులకు పిలుపునిచ్చారు.

Tags

Read MoreRead Less
Next Story