కౌరవులకు అధికారం ఉన్నా చివరికి పాండవులే విజయం సాధిస్తారు : చంద్రబాబు

కౌరవులకు అధికారం ఉన్నా చివరికి పాండవులే విజయం సాధిస్తారు : చంద్రబాబు

అమరావతి కోసం ప్రజలు ధర్మయుద్ధం చేస్తుంటే.. ప్రభుత్వం అధర్మయుద్ధం చేస్తోందని మండిపడ్డారు టీడీపీ అధినేత చంద్రబాబు. కౌరవులకు అధికారం ఉన్నా చివరికి పాండవులే విజయం సాధిస్తారని చెప్పారు. అమరావతి కోసం రైతులు చేస్తున్న ఉద్యమం 50 రోజులకు చేరడంతో రాజధాని గ్రామాల్లో పర్యటించారు చంద్రబాబు. రాయపూడి, తుళ్లూరు, పెదపరిమి, తాడికొండలో రైతుల దీక్షలకు సంఘీభావం తెలిపారు. రైతులను పరామర్శించారు.. ధైర్యం కోల్పోవద్దంటూ భరోసా ఇచ్చారు. ఎవరూ బాధపడొద్దని, ఐదు కోట్ల మంది ప్రజలు మీ వెనకున్నారంటూ ఆందోళనలు చేస్తున్న వారిలో ధైర్యం నింపారు. అటు పలువురు రైతులు ఉద్యమం కోసం విరాళాలు ప్రకటించారు. మరికొందరు అమరావతిని రక్షించాలంటూ చంద్రబాబు కాళ్లపై పడి వేడుకున్నారు..

అమరావతి పోరాటం చరిత్రలో నిలిచిపోతుందన్న చంద్రబాబు.. రైతుల త్యాగాలు వృథా కావని చెప్పారు..అమరావతిపై కావాలనే అనేక ప్రచారాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.. చివరికి ఉద్యమానికి కూడా సామాజిక వర్గం ముద్ర వేశారని మండిపడ్డారు.. రాజధాని మునిగిపోతుందని...ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగిందని తప్పుడు ప్రచారం చేశారని ఫైర్ అయ్యారు... ఇన్‌సైడర్‌ ట్రేడింగ్ జరిగితే కేసులు పెట్టాలని సవాల్ విసిరితే ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు చంద్రబాబు..

వైసీపీ ప్రభుత్వం అమరావతిని సర్వనాశనం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు చంద్రబాబు. శ్మశానం, ఎడారి అంటూచేసిన విమర్శలపై మండిపడ్డారు..రాజధాని కోసం 39 మంది రైతులు చనిపోయినా ప్రభుత్వంలో చలనం లేకపోవడం దారుణమన్నారు. ఇవన్నీ ప్రభుత్వ హత్యలేనని స్పష్టం చేశారు..

రాష్ట్రంలోని ఐదు కోట్ల మంది ప్రజలు ఓవైపు..ఉంటే జగన్‌ ఒక్కడే ఒక వైపు ఉన్నాడని అన్నారు చంద్రబాబు...ఈ ముఖ్యమంత్రికి పరిపాలన చేయడం తెలియదని..ఆయన తిక్క కుదిరే వరకు వదలిపెట్టమని హెచ్చరించారు..

ఎమ్మెల్యే ఆర్కేతో జగన్‌ దగ్గరకు వెళ్లిన వారంతా రైతులు కాదని.. వాళ్లంతా ఆళ్ల రామకృష్ణారెడ్డి బంధువులేనని విమర్శించారు చంద్రబాబు. సీఎం దగ్గరికి 10 మంది పెయిడ్ ఆర్టిస్టులను తీసుకెళ్లి‌.. రైతులని చెబుతున్నారని మండిపడ్డారు. ఆళ్ల రామకృష్ణారెడ్డి బంధువులే రాజధాని రైతులా?, మిగతా వాళ్లు రైతులు కాదా? అని నిలదీశారు.

తమను పరామర్శించేందుకు వచ్చిన చంద్రబాబు దగ్గర కన్నీటి పర్యంతమయ్యారు రాజధాని రైతులు, మహిళలు. ప్రభుత్వం తమను మోసం చేసిందంటూ బాధలు చెప్పుకున్నారు. అయితే ఈ ఇబ్బందులు తాత్కాలికమేనని... అంతిమంగా ధర్మం గెలిచి తీరుతుందని వారికి భరోసా ఇచ్చారు చంద్రబాబు.

Tags

Next Story