రాజధాని అంశాన్ని లోక్ సభలో లేవనెత్తిన గల్లా జయదేవ్

రాజధాని అంశాన్ని లోక్ సభలో లేవనెత్తిన గల్లా జయదేవ్

వేదిక ఎదైనా ఏపీ రాజధానిని రక్షించుకోవటమే లక్ష్యం. సాంస్కృతి వారసత్వంగా నిలిచేలా, ఉత్తరాంధ్ర, సీమ జిల్లాలకు సమాన దూరంలో ఉండేలా ప్రపంచస్థాయి రాజధానిని అందించే లక్ష్యంతో పురుడు పోసుకుంది అమరావతి. ఇప్పటికే కొన్ని భవనాలను చివరి దశకు చేరుకున్నాయి. కానీ, రాజధాని వికేంద్రీకరణతో అమరావతిని కేవలం అసెంబ్లీ వ్యవహారాలకే పరిమితం చేయాలనే కుట్రలపై ఏపీ జనం పోరుబాట పట్టారు. ఒకే రాష్ట్రం.. ఒకే రాజధాని అంటున్న జనం గొంతుకను పార్లమెంట్ లో వినిపిస్తున్నారు టీడీపీ ఎంపీలు. అభివృద్ధి వికేంద్రీకరణ పేరుతో మూడు రాజధానులను ఏర్పాటు చేయడం సరికాదన్న జయదేవ్.. మూడు రాజధానులతో ఏపీకి అనేక సమస్యలు వస్తాయన్నారు.

దీనిపై స్పందించిన లోక్ సభ డిప్యూటీ స్పీకర్ ఎ.రాజా.. రాజధాని అంశం రాష్ట్ర పరిధిలోని అంశమని అన్నారు. దీంతో ఆంధ్రప్రదేశ్ రాజధాని సమస్య రాష్ట్ర సమస్య కాదని.. జాతీయ సమస్య అని అన్నారు టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్. అయితే..రాజధానిపై జయదేవ్ ప్రసంగిస్తున్న సమయంలో వైసీపీ ఎంపీలు అడుగడుగునా అడ్డుతగిలారు.

రాష్ట్ర విభజన తర్వాత జరిగిన పరిణామాలను రాష్ట్ర పరిధిలో కాకుండా..రాష్ట్ర విభజన చేసిన కేంద్రం పరిధిలోని అంశంగా భావించాలని టీడీపీ ఎంపీలు తమ వాదన వినిపించారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి ఒక్క రూపాయి కూడా తెచ్చుకోలేని స్థితిలో జగన్ ప్రభుత్వం ఉందని..టీడీపీ ఎంపీలు మండిపడ్డారు. 25 మంది ఎంపీలను ఇస్తే ప్రత్యేకహోదా సాధిస్తామన్న జగన్ మాటలు ఏమయ్యాయని నిలదీశారు.

అటు రాస్యసభలోనూ ఏపీకి సంబంధించిన అంశాలను ప్రస్తావించినట్లు టీడీపీ ఎంపీలు వివరించారు. పొలిటిషీయన్స్ పై అవినీతి కేసుల్లో వేగంగా విచారణ పూర్తి చేయాలని సూచించారు. జగన్‌పై ఉన్న కేసులపై త్వరితగతిన విచారణ చేపట్టాలని రాజ్యసభ జీరో అవర్‌లో ప్రశ్నించామని చెప్పారు. అమరావతిని రక్షించుకునేందుకు తమ పోరాటం కొనసాగిస్తామని అన్నారు ఎంపీలు. రాజధాని వికేంద్రీకరణ పేరుతో జరుగుతున్న కుట్రలను అడ్డుకుంటామని అన్నారు.

Tags

Next Story