ఏపీ హైకోర్టులో పలు కీలక కేసులపై విచారణ
ఏపీ హైకోర్టులో పలు పిటిషన్లపై కీలక విచారణలు జరగనున్నాయి. వివేకానంద రెడ్డి హత్యకేసును సీబీఐకు అప్పగించాలన్న పిటిషన్‌పై హైకోర్టు విచారించనుంది. జగన్ ప్రభుత్వం కేసును తప్పుదోవ పట్టిస్తోందేమో అనే అనుమానంతో వివేకా కుమార్తె సునీత, భార్య సౌభాగ్యమ్మ, టీడీపీ నేతలు బీటెక్ రవి, ఆదినారాయణరెడ్డి దాఖలు చేసిన పిటిషన్లపై కోర్టు విచారించనుంది. వీటికి తోడు ఏపీలో పంచాయతీ కార్యాలయాలకు వైసీపీ రంగులు వేయడాన్ని ఖండిస్తూ దాఖలైన పిటిషన్లపై కూడా విచారణ జరగనుంది. ఈడీబీ ఎక్స్ CEO IRS అధికారి కృష్ణ కిషోర్ నిధుల దుర్వినియోగం చేసిన సీబీఐ కేసుపైనా విచారణ ఉంది. ఏపీలో స్థానిక ఎన్నికల జీవో 176ను నిలుపుదల చేయాలంటూ కర్నూలుకు చెందిన ప్రతాప్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరగనుంది. 50 శాతానికి మించి రిజర్వేషన్లు అమలుపై సుప్రీం అభ్యంతరాలు ఉండడంతో 59.85 శాతం రిజర్వేషన్ల ప్రకారం ఎన్నికలు నిర్వహించాలా, 50 శాతానికే పరిమితం చేయాలా, ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలి అనే అంశాలపై హైకోర్టు తీర్పు ఇవ్వనుంది.
మరోవైపు అమరావతి రాజధాని అంశంపై హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం గురువారం విచారణకు రానుంది. విశాఖపట్నంలోని మిలీనియం టవర్స్‌కు నిధులు కేటాయించడం, కర్నూలుకు ప్రభుత్వ కార్యాలయాల తరలింపుపై పిటిషనర్ మండవ రమేష్ అభ్యంతరం వ్యక్తంచేశారు. అమరావతిలో వేల కోట్ల రూపాయల పనులు జరుగుతుంటే.. వాటిని మౌఖిక ఆదేశాలతో ప్రభుత్వం నిలిపేసిందని పిటిషన్‌లో పేర్కొన్నారు. మరోవైపు.. సుప్రీంకోర్టు, హైకోర్టులకు దురుద్దేశాలు ఆపాదిస్తున్నారని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిర్ణయాలు రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయని ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దానిపై హైకోర్టు ధర్మాసనం విచారణ చేయనుంది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com