కియా మోటార్స్ తరలిపోతుందనే వార్తలను ఖండించిన కియా యాజమాన్యం, ఏపీ ప్రభుత్వం

కియా మోటార్స్ తరలిపోతుందనే వార్తలను ఖండించిన కియా యాజమాన్యం, ఏపీ ప్రభుత్వం

ఆంధ్రప్రదేశ్‌ నుంచి కియా మోటార్స్‌ తరలిపోతోందని.. తమిళనాడు ప్రభుత్వంతో చర్చలు జరుగుతున్నాయంటూ రాయ్‌టర్స్‌ సంస్థ ప్రచురించిన కథనాన్ని ఏపీ అధికార యంత్రాంగం ఖండించింది. ఆ కథనం పూర్తిగా అవాస్తవమని పరిశ్రమలు, వాణిజ్యం, పెట్టుబడుల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రజత్ భార్గవ ఖండించారు. అసత్యాలతో కూడిన కథనంగా అభివర్ణించారు. కియా, ఏపీ ప్రభుత్వం కలిసి పనిచేస్తున్నాయని చెప్పారాయన.

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ విధానాలతో కియా మోటార్స్‌ ఇబ్బందులు పడుతోందని.. తమ పెట్టుబడులు తమిళనాడుకు తరలించే ఆలోచన చేస్తోందంటూ ప్రచురితమైన కథనాలను ఆ సంస్థ ఖండించింది. తమిళనాడు ప్రభుత్వంతో చర్చలు జరగడంలేదని తెలిపింది. ఏపీ సర్కార్ నుంచి ఎలాంటి ఇబ్బందులు లేవని కియా ప్రతినిధులు చెప్తున్నారు. స్థానిక ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నామని స్పష్టంచేశారు.

అంతకుముందు.. ఆంధ్రప్రదేశ్‌ నుంచి కియా మోటార్స్ తరలిపోతుందంటూ రాయ్‌టర్స్‌ వార్తాసంస్థ సంచలన కథనం రాసింది. ఆ సంస్థను ఉటంకిస్తూ.. ప్రముఖ వెబ్‌సైట్లు కథనాలు ఇచ్చాయి. ఏపీలో టీడీపీ ప్రభుత్వం పడిపోయి.. వైసీపీ సర్కార్‌ రావడంతో.. కియాకు కష్టాలు మొదలయ్యాయని వాటి సారాంశం. ప్రైవేట్ కంపెనీల్లో 75 శాతం ఉద్యోగాలను స్థానికులకు ఇవ్వాలని చట్టం చేయడంతో పాటు.. కియా మోటార్స్‌కు ఇస్తామన్న ప్రోత్సాహకాలను సమీక్షిస్తామనడాన్ని అందులో ప్రధానంగా ప్రస్తావించారు. తమిళనాడుకు తరలివెళ్లేందుకు.. అక్కడి ప్రభుత్వంతో చర్చలు జరుగుతున్నట్టు రాశారు. ఆ సంప్రదింపులు ప్రాథమిక దశలో ఉన్నాయని.. మరో వారంలో కార్యదర్శి స్థాయి చర్చలు జరుగుతాయని తెలిపారు. అయితే.. రాష్ట్ర ప్రభుత్వం, కియా ప్రతినిధులు వాటిని ఖండించారు.

Tags

Read MoreRead Less
Next Story