గద్దెపై కొలువుదీరిన సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజు

గద్దెపై కొలువుదీరిన సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజు

ఆసియాలోనే అతి పెద్ద గిరిజన జాతర మేడారం..ఎటు చూసిన జనసంద్రంగా మారింది. నిజానికి జాతర బుధవారం నుంచి ప్రారంభమైనా..భక్తులు వారం ముందు నుంచే మేడారం బాట పట్టారు. ఇక ఇప్పుడు అడవి తల్లులు గద్దెనెక్కే మహా ఘట్టంతో వన దేవతల దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలొస్తున్నారు. దీంతో రాష్ట్రంలో దారులన్ని మేడారం వైపే మళ్లాయి.

మేడారం జాతరలో భాగంగా సారలమ్మను గద్దెపై ప్రతిష్టించారు. గిరిజన పూజారులు, జిల్లా అధికారుల ఆధ్వర్యంలో కన్నెపల్లి నుంచి సారక్క, కొండాయి నుంచి గోవిందరాజులు, గంగారం మండలం పోనుగొండ్ల నుంచి పగిడిద్దరాజును పెనుక వంశస్తులు తీసుకొచ్చారు. వీరి రాకతో జాతర లాంఛనంగా ప్రారంభమైంది. డప్పు వాయిద్యాల నడుమ గిరిజన సంప్రదాయంలో ఊరేగింపుగా సారలమ్మను తీసుకువచ్చిన తర్వాత అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి నూతన వస్త్రాలు సమర్పించారు.

ఇక గురువారం సమక్క గద్దెపై కోలువుదీరుతారు. రేపు వన దేవతలను కొలుస్తూ పూజలు చేస్తారు. ఆ తర్వాత నాలుగు రోజులు జాతర ముగింపు దశకు చేరుకుంటుంది. అమ్మవార్లు వనప్రవేశం చేస్తారు. అయితే సమ్మక్క సారలమ్మలు వనప్రవేశం చేయకముందే ఆ తల్లులను దర్శించుకునేందుకు జనం భారీ ఎత్తున తరలొస్తున్నారు. వన దేవతలు సమ్మక్క-సారలమ్మకు ప్రీతిపాత్రమైన బెల్లంను బంగారంగా భక్తులు సమర్పిస్తున్నారు.

అటు పుణ్యస్నానాలతో జంపన్న వాగు భక్తులతో కిటకిటలాడుతుంది. సాధారణ భక్తులతో పాటు అమ్మవారి దర్శనానికి వీఐపీల తాకిడి కూడా పెరిగింది. సమ్మక్క-సారలమ్మ జాతరలో జోగినిలు తమ నృత్యాలతో ఆకట్టుకుంటున్నారు. దైవానికి అంకితం అయ్యే తమకు ప్రత్యేక దర్శనం కల్పించాలని జోగినిలు కోరుతున్నారు.

జాతర ఏర్పాట్లు, భక్తుల రద్దీ, దర్శనాలు, ట్రాఫిక్‌పై మంత్రులు, అధికారులు సమీక్షిస్తున్నారు. ఈ మహాజాతరకు 10వేల మంది పోలీసు సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నారు.. గతంలో కంటే ఈ సారి సమాచార, రోడ్డు, రవాణా సౌకర్యాలు మెరుగవడం కూడా భక్తుల సంక్య పెరిగేందుకు కారణమైంది. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి ఆర్టీసీ ప్రత్యేక బస్సలను నడుపుతోంది. అలాగే బేగంపేట విమానాశ్రయం నుంచి హెలికాఫ్టర్ సర్వీస్ కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు.

Tags

Read MoreRead Less
Next Story