ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం

ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. తాడేపల్లి మున్సిపాలిటీలో 8 గ్రామ పంచాయతీలను విలీనం చేస్తూ ప్రభుత్వం గురువారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో రూరల్‌ మండలంలోని పెనుమాక, ఉండవల్లి, ఇప్పటం, మల్లెంపూడి, చిర్రావురు, వడ్డేశ్వరం, గుండిమెడ, ప్రాతురు గ్రామాలు తాడేపల్లి మున్సిపాలిటీలో విలీనం అయ్యాయి. ఈ మేరకు ఎనిమిది గ్రామ పంచాయతీలను పంచాయతీరాజ్‌ శాఖ డీనోటిఫై చేసింది.

రాజధాని అమరావతి నగర పరిధిలోని ఐదు గ్రామ పంచాయతీలను మంగళగిరి, తాడేపల్లి పురపాలక సంఘాల్లో విలీనం చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు వెలువరించింది. రాజధాని నగర పరిధిలోని 25 గ్రామ పంచాయతీలతోపాటు కొత్తగా మరో 3 పంచాయతీలను కలిపి అమరావతి కేపిటల్ సిటీ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటుకు ప్రతిపాదనలు ఉండగానే.. మరోవైపు వీటిలోని నవులూరు, బేతపూడి, ఎర్రబాలెం, పెనుమాక, ఉండవల్లి పంచాయతీలను మంగళగిరి, తాడేపల్లి పురపాలక సంఘాల్లో విలీనం చేస్తూ ప్రభుత్వం గురువారం రాత్రి వేర్వేరుగా జీవోలు ఇచ్చింది.

తాడేపల్లి మండలంలో ఎనిమిది, మంగళగిరి మండలంలో ఐదు పంచాయతీలను తాడేపల్లి, మంగళగిరి పురపాలక సంఘాల్లో విలీనం కోసం గుంటూరు కలెక్టర్ నుంచి వేర్వేరుగా వచ్చిన ప్రతిపాదనలను పురపాలకశాఖ కమిషనర్ కార్యాలయం ప్రభుత్వానికి పంపింది. 2020 జనవరి 10న ప్రభుత్వ ఆదేశాలపై పది రోజుల వ్యవధిలో తాడేపల్లి పురపాలక సంఘ అధికారులు, 11 రోజుల వ్యవధిలో మంగళగిరి పురపాలక అధికారులు.. కౌన్సిల్ తీర్మానాలు చేసి పంచాయతీల విలీనానికి సమ్మతిని తెలుపుతూ ప్రభుత్వానికి తిరిగి సమాచారాన్ని పంపారు. దీనిపై పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధిశాఖ అంతేవేగంగా స్పందించి పురపాలక సంఘాల్లో పంచాయతీల విలీనానికి ప్రకటన చేసింది.

Tags

Read MoreRead Less
Next Story