కర్నూలులో గందరగోళంగా మారిన వైసీపీ రాజకీయం

కర్నూలులో గందరగోళంగా మారిన వైసీపీ రాజకీయం

రాయలసీమ ముఖద్వారమైన కర్నూలు అసెంబ్లీ సెగ్మెంట్ లో తాజా రాజకీయాలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. అధికార పార్టీకి చెందిన నేతలే నువ్వా నేనా అన్నట్లుగా పోటా పోటీగా మాటల యుద్దానికి దిగుతున్నారు. పార్టీని నమ్ముకుని పనిచేస్తున్న కార్యకర్తలపై దాడులు చేయడమే కాకుండా అక్రమ కేసులు పెడుతున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే హఫీజ్, మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి మధ్య వర్గపోరు రోజురోజుకీ తీవ్రమవుతోంది. ఒకరిపై మరొకరు విమర్శలకు దిగడంతో కేడర్‌ గందరగోళంలో పడిపోయింది.

తమ పార్టీకే చెందిన మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డిపై ప్రస్తుత ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆయనపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆయన పేరు చెప్పకుండా పరోక్షంగా మాట్లాడిన హఫీజ్, నిజమైన వైసీపి కార్యకర్తలపై.. తన వర్గీయులతో మోహన్ రెడ్డి దాడులు చేయిస్తున్నాడని ఆరోపించారు. కార్యకర్తల కోసం అవసరమైతే పదవినైనా వదులుకొని అండగా ఉంటానని స్పష్టం చేశారు. ఎన్నికల్లో ఎస్వీ కుట్రల వల్లే తన మెజార్టీ తగ్గిందని లేదంటే 20 వేల మెజార్టీ వచ్చేదని విమర్శించారు.

హఫీజ్ విమర్శలను మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి ఖండించారు. తనపై ఎన్ని విమర్శలు చేసినా రానున్న ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కలసి కట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉందని కౌంటర్ ఇచ్చారు. త్వరలో స్థానిక సంస్థలు, మున్సిపల్ ఎన్నికలు రాబోతున్న నేపధ్యంలో జిల్లాలో ఇద్దరి నేతల మధ్య ఆదిపత్యపోరు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ సమయంలో నేతల మధ్య సమన్వయం లేక పోతే పార్టీకి తీవ్రంగా నష్ట జరుగుతుందని పార్టీనేతల ఆందోళన చెందుతున్నారు. మరోవైపు ఇధ్దరు నేతల ఒకరిపై ఒకరు వ్యక్తిగత ఆరోపణలు, విమర్శలు చేసుకోవడం వల్ల క్యాడర్ రెండుగా చీలి గందరగోళానికి గురవుతున్నారు. కర్నూలు జిల్లాలోని ఇంటి పోరుని అధినేత జగన్ ఎలా గాడిలో పెడతారన్నది ఆసక్తికరంగా మారింది.

Tags

Read MoreRead Less
Next Story