టెంట్లు తీసేసి తాటాకు పందిళ్లు వేసుకున్న రైతులు

టెంట్లు తీసేసి తాటాకు పందిళ్లు వేసుకున్న రైతులు

నవ్యాంధ్ర అంతటా సేవ్‌ అమరావతి నినాదం మిన్నంటుతోంది.. రాజధానిని అమరావతి నుంచి విశాఖ తరలించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఆందోళనలు చేపడుతున్నారు. రాజధాని గ్రామాల్లో 52 రోజులుగా ఉద్యమ జ్వాలలు ఎగసిపడుతున్నాయి. ఎన్ని రూపాల్లో నిరసనలు తెలియజేస్తున్నా ప్రభుత్వం మనసు మాత్రం కరగడం లేదు. అయినప్పటికీ, తమ పోరాటం ఆగదని స్పష్టం చేస్తున్నారు. ఎన్ని రోజులైనా ప్రభుత్వం దిగివచ్చే వరకు ఆందోళనలు కొనసాగిస్తూనే ఉంటామని చెబుతున్నారు. నిరసన దీక్షలు, రిలే నిరాహార దీక్షలు, జల దీక్షలు ఇలా అనేక రూపాల్లో తాము పడే ఆవేదన ప్రభుత్వానికి తెలిసేలా చేస్తున్నారు రాజధాని ప్రాంత రైతులు.

తాళ్లాయపాలెంలో మహిళలు జలదీక్ష చేపట్టారు. మొదట కృష్ణానదికి పూజలు నిర్వహించారు. తరువాత చీర పెట్టి పూజలు నిర్వహించారు. ఆ వెంటనే కృష్ణా నదిలో జలదీక్ష చేపట్టారు. తాము 33వేల ఎకరాలు ప్రభుత్వానికి ఇచ్చింది తమ బాగు కోసం కాదని, ఐదు కోట్ల ప్రజల బాగు కోసమేనని వారంటున్నారు.

తుళ్లూరులో రైతులు టెంట్లు తీసేసి తాటాకు పందిళ్లు వేసుకున్నారు. ఆర్థిక ఇబ్బందులు ఎదురవడంతో శాశ్వతంగా ఉండేలా పందిళ్లు వేశారు. ఎన్నాళ్లైనా దీక్షలు ఆపేది లేదని స్పష్టం చేస్తున్నారు. రాయపూడిలో దీక్షాశిబిరాన్ని మాజీ మంత్రి దేవినేని ఉమ సందర్శించి రైతులకు సంఘీభావం తెలిపారు. ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకుంటున్న జగన్ సర్కారుకు ప్రజలే సరైన బుద్ధి చెబుతారని అన్నారు. మహిళలు సైతం జగన్‌ సర్కార్‌పై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.. 51 రోజుల నుంచి ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వం కనీసం పట్టించుకోవడం లేదని.. ఇంతకంటే దుర్మార్గం మరొకటి ఉండదని వారంటున్నారు. ఇక అమరావతికి మద్దతుగా అనంతపురం జిల్లా కదిరిలో JAC ఆధ్వర్యంలో నిరసనలు తెలియజేశారు.. లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకున్న జేఏసీ నాయకులు.. జగన్‌కు మంచి బుద్ధి ప్రసాదించాలని కోరారుకున్నారు.

Tags

Read MoreRead Less
Next Story