ఈడీ కేసులో కోర్టుకు ఏపీ సీఎం జగన్.. సర్వత్రా ఉత్కంఠ
ఆస్తుల కేసులో ఏపీ సీఎం జగన్ శుక్రవారం హైదరాబాద్‌లోని సీబీఐ ప్రత్యేక కోర్టుకు హాజరు కానున్నారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కేసులో ఆయన కోర్టుకు హాజరవుతున్నారు. గురువారం సాయంత్రం వరకు ఆయన హైదరాబాద్ పర్యటన ఖరారు కాలేదు. అయితే, వ్యక్తిగత హాజరు మినహాయింపు కుదరదని, విచారణకు హాజరు కావాల్సిందేనని ప్రత్యేక న్యాయస్థానం స్పష్టం చేసిన నేపథ్యంలో ఆయన కోర్టుకు హాజరవుతున్నారు.
మరోవైపు సీబీఐ కేసులో వ్యక్తిగత హాజరు మినహాయింపునకు సంబంధించిన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరుగుతోంది. ఈ నేపథ్యంలో జగన్ తరపు న్యాయవాదులు ఇప్పటి వరకు ఆబ్సెంట్ పిటిషన్ వేస్తూ వచ్చారు.. ఈసారి కూడా అదే చేస్తారని భావించినప్పటికీ నిర్ణయం మారింది. రెండు వారాల క్రితం ఈడీ కోర్టు జనవరి 31న విచారణకు తప్పనిసరిగా హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది.. గత వారం కూడా జగన్ కోర్టుకు హాజరు కాలేదు.. కోర్టు ఇచ్చిన గడువు ముగియడంతో ఆయన ఈరోజు కోర్టుకు హాజరు కానున్నారు. దీంతో ఈరోజు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయోనన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది..
ఇక ముందుగా నిర్ణయించుకున్న షెడ్యూల్ ప్రకారం శుక్రవారం సీఎం జగన్ రాజమండ్రిలో పర్యటించాల్సి ఉంది.. దిశ పోలీస్ స్టేషన్‌ను ప్రారంభించాల్సి ఉంది. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే, పర్యటన శనివారానికి వాయిదా వేసినట్లు గురువారం సాయంత్రం సీఎం కార్యాలయం నుంచి అధికారులకు సమాచారం అందింది. ప్రత్యేక న్యాయస్థానానికి హాజరు కానున్న నేపథ్యంలో జగన్ శనివారం రాజమండ్రిలో పర్యటిస్తారు. దిశ పోలీస్‌స్టేషన్‌ను ప్రారంభిస్తారు.
Tags
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com