మేడారం జాతర.. భక్తులను కనువిందు చేసిన అమ్మవారి రాక..

మేడారం జాతర.. భక్తులను కనువిందు చేసిన అమ్మవారి రాక..

మేడారం జాతరలో కీలకఘట్టం ఆవిష్కృతమైంది. భక్తుల కోలాహలం మధ్య సమ్మక్క తల్లి మేడారం గద్దెపై కొలువు దీరింది. చిలకలగుట్టపై కుంకుమ భరిణ రూపంలో ఉన్న సమ్మక్క తల్లిని మేడారానికి ఊరేగింపుగా తీసుకువచ్చారు పూజారులు. ఆదివాసీల సంప్రదాయ నృత్యాలు, డబ్బు చప్పుల మధ్య అమ్మవారి రాక.. భక్తులను కనువిందు చేసింది. ఈ సందర్భంగా ములుగు జిల్లా ఎస్పీ సంగ్రామ్ సింగ్ పాటిల్ గాల్లోకి కాల్పులు జరిపి సమ్మక్కకు స్వాగతం పలికారు. సమ్మక్క స్వాగత కార్యక్రమంలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, ఇంద్రకరణ్ రెడ్డి, కలెక్టర్ కర్ణన్, ఎమ్మెల్యేలు సీతక్క, వీరయ్య పాల్గొన్నారు.

ప్రత్యేక పూజల మధ్య మేడారం గద్దెపై సమ్మక్కను ప్రతిష్టించారు. దారి పొడవునా లక్షలాది భక్తులు సమ్మక్క తల్లికి ఎదురేగి.. కోళ్లు, మేకలు బలి ఇస్తూ స్వాగతం పలికారు. సమ్మక్క రాకతో అందరు వనదేవతలు మేడారం గద్దెలపై కొలువుతీరారు. దీంతో జాతర మరింత శోభాయమనాంగా మారింది. వనదేవతల దర్శనానికి భక్తులు పోటెత్తడంతో.. మేడారం జనసంద్రంగా మారింది. ఎట్టు చూసిన భక్తజనసందోహంతో కిక్కిరిసిపోయింది. జంపన్న వాగులో పుణ్యస్నానాలు, కోళ్లు, గొర్రెల బలులు, తలనీలాలు. తల్లులకు ఎత్తు బెల్లం సమర్పణ. ఇలా ప్రతి అపురూప ఘట్టంతో.. వన జాతర భక్తులతో పోటెత్తుతోంది. అమ్మవార్ల భజనలు, శివనామస్మరణతో మేడారం మారుమోగుతోంది. శివసత్తుల పూనకాలతో ఆలయ పరిసరాలు కోలాహలంగా మారాయి.

తల్లులిద్దరూ గద్దెలపైకి చేరడంతో.. శుక్రవారం ప్రధాన జాతర సాగనుంది. దీంతో భక్తుల రాక మరింతగా పెరిగే అవకాశం ఉంది. అంచనాలు మించి భక్తులు పోటెత్తే అవకాశం ఉండటంతో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పకడ్బంది ఏర్పాట్లు చేశారు. శుక్రవారం, శనివారం వనదేవతలు గద్దెలపై ఉంటారు. ఆదివారం సాయంత్రం దేవతల వనప్రవేశంతో జాతర ముగుస్తుంది.

Tags

Read MoreRead Less
Next Story