ఏఎన్‌యూలో మూడు రాజధానుల మంటలు
మూడు రాజధానుల అంశంపై సెమినార్ సందర్భంగా జరిగిన ఘటనలతో ఇప్పటికీ వర్సిటీలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. వర్సిటీలో జరిగిన ఘటనలపై వాస్తవాలు తెలుసుకునేందుకు వెళ్లిన టీడీపీ నిజనిర్ధారణ కమిటీని పోలీసులు అడ్డుకోవడంతో టెన్షన్ వాతావరణం తలెత్తింది. వర్సిటీ మెయిన్ గేట్ ఎదుట టీడీపీ నేతలు బైటాయించి నిరసన తెలిపారు. పోలీసుల తీరును తీవ్రంగా తప్పు పట్టారు.
గురువారం యూనివర్సిటీలో నిర్వహించిన సెమినార్‌లో మూడు రాజధానులతో ఎలాంటి ప్రయోజనం లేదని నంద కుమారి అనే విద్యార్థిని స్పష్టం చేసింది. దీంతో అక్కడే ఉన్న JAC అధ్యక్షుడు రాజశేఖర్ బాబు ఆ విద్యార్థినిపై చేయి చేసుకున్నాడు. దీనికి నిరసనగా యూనివర్సిటీ ఎదుట విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టాయి. రాజధాని రైతులు, మహిళలు వీరికి మద్దతుగా నిరసన తెలియజేశారు. మాజీ మంత్రి దేవినేని ఉమ కూడా విద్యార్థులకు సంఘీభావం తెలిపారు. వర్సిటీలో జరుగుతున్న అక్రమాలపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి.
ఈ నేపథ్యంలోనే జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే దీక్షలకు సంఘీభావం తెలిపేందుకు, వర్సిటీలో అక్రమాలపై అధ్యయనం చేసేందుకు టీడీపీ నిజనిర్ధారణ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే బాల వీరాంజనేయస్వామి, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, ఎమ్మెల్సీ రామకృష్ణ అక్కడకు వెళ్లింది. అయితే, టీడీపీ నేతలను వర్సిటీ అధికారులు అనుమతించలేదు. పోలీసులు కూడా ఆంక్షలు పెట్టడంతో కమిటీ సభ్యులు వర్సిటీ ఎదుట ఆందోళన చేపట్టారు. వైస్ ఛాన్సులర్ రాజశేఖర్ అక్రమాలపై విచారణ చేపట్టి వర్సిటీ ప్రతిష్టను కాపాడాలని టీడీపీ నేతలు డిమాండ్ చేశారు. వెంటనే వీసీని తొలగించాలని.. లేకుంటే పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
వర్సిటీలో ప్రశాంతత కరువైందని.. వర్సిటీ ప్రతిష్ట దిగజారేలా వీసీ పనితీరు ఉందని టీడీపీ నేతలు దుయ్యబట్టారు. వీసీ అక్రమాలపై గవర్నర్‌కు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. మరోవైపు యూనివర్సిటీ మెయిన్ గేటు ఎదుట ఆందోళనకు దిగిన టీడీపీ నేతలను పోలీసులు అరెస్టు చేసి పెద కాకాని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com