ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్ ప్రారంభం కాబోతోంది. ఉదయం ఎనిమిది గంటలకు పోలింగ్ ప్రారంభమై సాయంత్రం ఆరు గంటలకు పోలింగ్ ముగుస్తుంది. మొత్తం 13 వేల 767 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా అందులో 3,141 పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మకమైనవిగా గుర్తించారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో పటిష్ట భద్రత చర్యలు చేపట్టారు. మొత్తం 190 కంపెనీల కేంద్ర బాలగాలతో పాటు 42 వేల మంది పోలీసులు, 19 వేల మంది హోంగార్డులు పోలింగ్ భద్రతలో పాల్గొంటున్నారు.

పోలింగ్ సజావుగా నిర్వహించేందుకు పకడ్బందీ చర్యలు చేప్టటారు. ఇప్పటికే ఈవీఎం సహా పోలింగ్ సామాగ్రి మొత్తం ఆయా కేంద్రాలకు చేరింది. దాదాపు 60 వేల మంది సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారు. 70 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్న ఢిల్లీలో కోటీ 46 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. 80 ఏళ్లు దాటిన వయోవృద్ధులు ఓటు హక్కు వినియోగించుకోవడానికి వీలుగా ప్రయాణ సౌకర్యం కల్పించనున్నట్టు ఈసీ ప్రకటించింది. అలాగే దివ్యాంగులు కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అయితే..సీఎం అరవింద్ కేజ్రివాల్ బరిలో ఉన్న న్యూ ఢిల్లీ నియోజకవర్గం నుంచి 26 మంది పోటీ చేస్తున్నారు.

పోలింగ్ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు జరగనుంది. ఆరు గంటల లోపు క్యూ లైన్లలో నిల్చున్నవారంరికీ ఆలస్యమైనా ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉంటుంది. అయితే..ఢిల్లీ అసెంబ్లీ గడువు ఫిబ్రవరి 22తో ముగియనుంది. దీంతో ఈసీ, ఢిల్లీ శాసనసభ ఎన్నికలకు రంగం సిద్ధం చేసింది. ఈ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ, బీజేపీ, కాంగ్రెస్ మధ్య త్రిముఖ పోటీ ఉన్నట్లు కనిపించినా.. అసలు పోటీ మాత్రం బీజేపీ, ఆప్ మధ్యే నెలకొంది. రెండు దశాబ్దాల వనవాసానికి ముగింపు పలకాలని కమలదళం సర్వశక్తులు ఒడ్డింది. వరుసగా రెండోసారి అధికారం సాధించాలని ఆప్ పార్టీ విపరీతం గా శ్రమించింది.

ఢిల్లీ ఓటరు తీర్పు విలక్షణంగా ఉంటుంది. 1998 నుంచి 2013 వరకు వరుసగా 15 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీకి అధికారం కట్టబెట్టిన ఓటర్లు, ఆ తర్వాత రూట్ మార్చారు. లోక్‌సభ ఎన్నికల్లో ఒకవిధంగా, అసెంబ్లీ ఎన్నికల్లో మరో విధంగా స్పందించారు. 2013 అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు సమాన స్థాయిలో సీట్లు వచ్చాయి. 2014లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మొత్తం 7 లోక్‌సభ స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంది. కానీ, 2015 శాసనసభ ఎన్నికల్లో కమలదళం కంగుతింది. మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు గాను ఆమ్ ఆద్మీ పార్టీ ఏకంగా 67 సీట్లు సాధించి చరిత్ర సృష్టించింది. బీజేపీకి 3 స్థానాలు మాత్రమే వచ్చాయి. ఇక 2019 లోక్‌సభ ఎన్నికల్లో కమలదళం మొత్తం 7 పార్లమెంటరీ స్థానాల్లో గెలుపొందింది. మరి, ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో ఢిల్లీ ఓటర్లు ఎవరికి పట్టం కడతారో ఈనెల 11న బయటపడనుంది.

Tags

Next Story