తడబడిన కివీస్‌.. దూకుడు ప్రదర్శించిన భారత్..

తడబడిన కివీస్‌.. దూకుడు ప్రదర్శించిన భారత్..

న్యూజీలాండ్‌తో జరుగుతున్న రెండో వన్డేలో భారత్‌ బౌలర్లు దూకుడు ప్రదర్శించారు. తొలుత నిలకడగా ఆడి.. మధ్యలో తడబడి.. చివర్లో నిలిచిన కివీస్‌ జట్టు.. నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 273 పరుగులు చేసింది. కివీస్‌ ఓపెనర్లు 93 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి గట్టి పునాది వేసినా.. తర్వాత మన ప్లేయర్లు దెబ్బ కొట్టారు. స్పిన్నర్‌ చాహల్... నెకోలస్‌ను ఔట్ చేశాడు. వన్‌డౌన్‌లో వచ్చిన బ్లుండెల్‌‌ను శార్ధూల్ పెవిలియన్‌కు పంపాడు. దీంతో న్యూజీలాండ్ తడబడింది. మొదటి నలుగురు బ్యాట్స్‌మెన్ తప్పితే.. ఐదుగురు ఆటగాళ్లు సింగిల్ డిజిట్‌కే పరిమితం అయ్యారు. అయితే.. రాస్ టేలర్‌ ప్రమాదకరంగా మారాడు. ఒకరి వెంట మరొకరు ఔట్ అవుతుండడంతో డిఫెన్స్‌లో పడినా.. చివర్లో జామీసన్‌ అండతో చెలరేగిపోయాడు. వాళ్లిద్దరూ అభేద్యంగా 76 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. దీంతో.. భారత్‌ ముందు 274 పరుగుల టార్గెట్‌ను కివీస్ నిర్దేశించింది.

ఆక్లాండ్‌లోని ఈడెన్‌ పార్క్‌లోని వాతావరణాన్ని, పిచ్‌ను భారత్ సద్వినియోగం చేసుకుందనే చెప్పాలి. టాస్‌ గెలిచిన కోహ్లీసేన బౌలింగ్ తీసుకుంది. చాహల్, ఠాకూర్ రాణించారు. జడేజా పొదుపైన బౌలింగ్ చేశాడు. ఓ రనౌట్‌ చేశాడు. చాహల్ మూడు వికెట్లు పడగొట్టగా.. ఠాకూర్ ఇద్దరినీ పెవిలియన్‌కు పంపాడు. అయితే.. చివరి ఓవర్లలో బుమ్రా విఫలమయ్యాడు. ఠాకూర్ కూడా ఉదారంగా పరుగులిచ్చేశాడు.

Tags

Next Story