జేబీఎస్‌-ఎంజీబీఎస్‌ మెట్రో ప్రారంభం

జేబీఎస్‌-ఎంజీబీఎస్‌ మెట్రో ప్రారంభం

హైదరాబాద్‌ వాసులకు గుడ్‌న్యూస్. నగరంలో ట్రాఫిక్‌ రద్దీ చాలా ఎక్కువగా ఉండే MGBS-JBS స్టేషన్ల మధ్య మెట్రో సేవలు అందుబాటులోకి వచ్చాయి..JBS స్టేషన్‌లో జెండా ఊపి మెట్రో రైలు సేవలను ప్రారంభించారు సీఎం కేసీఆర్. అనంతరం స్టేషన్‌ పరిసరాలను పరిశీలించారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌, రాష్ట్ర మంత్రులు మహమూద్‌ అలీ, కేటీఆర్‌, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, శ్రీనివాస్‌ గౌడ్‌, మేయర్‌ బొంతు రామ్మోహన్‌, హైదరాబాద్‌ మెట్రో రైల్‌ ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

JBS‌-MGBS మెట్రో మార్గం11 కిలోమీటర్ల పొడవు ఉంటుంది..9 స్టేషన్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. జూబ్లీ బస్‌స్టేషన్‌, సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌, గాంధీ ఆసుపత్రి, ముషీరాబాద్, ఆర్టీసీ క్రాస్‌రోడ్డు, చిక్కడపల్లి, నారాయణగూడ, సుల్తాన్‌ బజార్‌తో పాటు రాష్ట్రంలోనే అతిపెద్ద ఆర్టీసీ బస్టాండ్ MGBS వరకు ఈ మార్గంలో మెట్రో రైలు పరుగులు పెట్టనుంది. ఈ రూట్‌లో ఒక చివర నుంచి మరో చివరకు చేరుకునేందుకు 16 నిమిషాల సమయం పట్టనుంది. నిత్యం సుమారు లక్షమంది ఈ మార్గంలో రాకపోకలు సాగిస్తారని అంచనా వేస్తున్నారు.

రైల్వే స్టేషన్, బస్‌స్టేషన్, ఆస్పత్రులు, విద్యా, వ్యాపార సంస్థలు ఈ మార్గంలో ఉండడంతో మెట్రో సేవలు చాలా కీలకంగా మారనున్నాయి. చాలావరకు ట్రాఫిక్ సమస్య పరిష్కారమయ్యే అవకాశం ఉంది. కోఠి, సుల్తాన్ బజార్ ప్రాంతాలకు ఈ రూటు కీలకం కానుంది. JBS నుంచి MGBSకు రోడ్డు మార్గంలో చేరుకోవాలంటే.. గంటా 10 నిమిషాల సమయం పడుతుంది. అదే మెట్రోలో కేవలం 16 నిమిషాల్లోనే చేరుకోవచ్చు.

హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టులో అత్యంత ఎత్తయినదిగా JBS మెట్రో స్టేషన్ నిలవనుంది. దీన్ని ఐదంతస్తుల ఎత్తులో నిర్మించారు. సికింద్రాబాద్ YMC కూడలివద్ద గతంలో నిర్మించిన ఫ్లైఓవర్‌ ఉండడంతో దానికి సమాంతరంగా నాగోల్-రాయదుర్గం మెట్రో మార్గాన్ని నిర్మించారు. దీంతో ఈ రెండు నిర్మాణాలపై 53 అడుగుల ఎత్తులో ఈస్టేషన్‌ను నిర్మించారు. సుమారు 5 అంతస్తులతో అత్యంత ఎత్తైన ట్రాక్ పై జర్నీ ప్రయాణికులకు సరికొత్త అనుభూతిని పంచనుంది.

ఇక MGBS మెట్రో స్టేషన్‌కు కూడా పలు ప్రత్యేకతలున్నాయి. ఇది దేశంలోనే అతిపెద్ద ఇంటర్‌ చేంజింగ్ స్టేషన్. 58 పిల్లర్లు, 6 గ్రిడ్స్‌తో నిర్మించారు. ఎల్బీనగర్ నుంచి మియాపూర్ మార్గంలో ప్రయాణించే కారిడార్-1కు సంబంధించిన రైళ్ల రాకపోకలు, ఇంటర్‌ఛేంజ్ ఈ మెట్రోస్టేషన్‌లోని కింది అంతస్తుల ద్వారా సాగుతుంది. కారిడార్2లోని JBS మార్గంలో వచ్చే రైళ్లన్నీ పైఅంతస్తుల ద్వారా వెళ్తాయి. ఐతే ఒక మార్గం నుంచి మరో మార్గానిరి

మారడానికి సులభమైన ఏర్పాట్లు చేశారు. రాబోయే 100 సంవత్సరాల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేకంగా నిర్మించారు. రిటైల్ అవుట్‌లెట్లు, ఎంటర్‌టైన్‌మెంట్ జోన్స్ , కన్వీయెన్స్ అవుట్‌లెట్స్‌ను కూడా అందుబాటులోకి తేనున్నారు.

JBS-MGBS మార్గంతో భాగ్యనగరవాసుల కల సంపూర్ణమైంది. మొదటి దశ మెట్రో రైలు ప్రాజెక్టులో ప్రతిపాదించిన 72 కిలోమీటర్ల మార్గంలో 69కిలోమీటర్ల మేర మెట్రో సేవలు అందుబాటులోకి వచ్చాయి. దీంతో దేశంలోనే రెండో అతిపెద్ద మెట్రో కారిడార్‌గా హైదరాబాద్ నిలిచింది.

Tags

Read MoreRead Less
Next Story