ప్రశాంతంగా ముగిసిన తెలంగాణ కుంభమేళా

ప్రశాంతంగా ముగిసిన తెలంగాణ కుంభమేళా

తెలంగాణ కుంభమేళా ప్రశాంతంగా ముగిసింది. చివరిరోజైన శనివారం...గద్దెల వద్ద గిరిజన పూజారులు అమ్మవార్లకు సంప్రదాయ పూజలు చేశారు. అనంతరం డోలు వాయిద్యాలు, డప్పు చప్పుళ్ల నడుమ అమ్మవార్లు సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులు వన ప్రవేశం చేయించారు.. దీంతో జనజాతరలో చివరిఘట్టం ముగిసింది. అమ్మవార్లను దర్శించుకునేందుకు గతంతో పోలిస్తే ఈసారి అధిక సంఖ్యలో భక్తులు వచ్చారు.. దాదాపు 20 నుంచి 25 శాతం అధికంగా వచ్చినట్లు అంచనా వేస్తున్నారు.

ప్రభుత్వం ఎలాంటి ఇబ్బంది లేకుండా సమ్మక్క-సారక్క జాతరను ఘనంగా నిర్వహించిందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలిపారు. త్వరలోనే శాశ్వత ప్రాతిపదికన వసతులు ఏర్పాటు చేస్తామని, ఇందుకోసం 100 ఎకరాలు సేకరిస్తామని చెప్పారు. మేడారాన్ని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ భావిస్తున్నారని ఎర్రబెల్లి అన్నారు..

శనివారం మేడారంలోని వనదేవతలను పలువురు రాజకీయ ప్రముఖులు దర్శించుకున్నారు. కేంద్ర మంత్రి అర్జున్‌ ముండా మొక్కులు చెల్లించుకున్నారు. జాతరను జాతీయ పండుగగా గుర్తించే అంశాన్ని ప్రధాని దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. త్వరలో గిరిజనుల ఆకాంక్ష నెరవేరుతుందని ఆశిస్తున్నట్టు అభిప్రాయపడ్డారు..

మేడారంలో జాతర ముగింపు వేళ భారీ వర్షం కురిసింది. అకాల వర్షం కారణంగా పలువురు భక్తులు, వ్యాపారులు ఇబ్బందులు పడ్డారు. వర్షాన్ని కూడా లెక్క చేయకుండా అమ్మవార్లకు భక్తులు మొక్కులు చెల్లించుకుంటున్నారు. అకస్మాత్తుగా కురిసిన వర్షాన్ని అమ్మవార్ల దీవెనలుగా భక్తులు అభివర్ణించారు..

నాలుగు రోజులు సాగిన ఈ జనజాతరలో తొలి రోజు సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులు గద్దెలపైకి చేరుకున్నారు. రెండో రోజు సమ్మక్కను గద్దెపై ప్రతిష్టించారు. మూడో రోజు భక్తులు వనదేవతలకు మొక్కులు చెల్లించారు. నాలుగోరోజైన శనివారం దేవతలు వన ప్రవేశం చేశారు.అయితే భక్తుల రద్దీ మాత్రం ఇంకా కొనసాగుతోంది..మరో మూడు రోజుల పాటు పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు.

Read MoreRead Less
Next Story