రాజమండ్రి వైసీపీ నాయకుల మధ్య ఆదిపత్య పోరు

రాజమండ్రి వైసీపీ నాయకుల మధ్య ఆదిపత్య పోరు

తూర్పు గోదావరి జిల్లాలో అధికార వైసీపీ నాయకుల మధ్య ఆదిపత్య పోరు తారా స్థాయికి చేరింది.. ముఖ్యంగా రాజమండ్రిలోని వైసీపీలో అంతర్గత విభేదాలతో పార్టీ శ్రేణులు తీవ్ర గందరగోళానికి గురవుతున్నారు. సీఎం జగన్ రాజమండ్రి పర్యటనలోనూ ఈ లుకలుకలు తీవ్ర స్థాయిలో బయటపడ్డాయి. అధికార పార్టీకి చెందిన పార్లమెంటు నాయకుడు తనదైన శైలిలో వ్యవహరిస్తూ ఆయా ప్రాంతాల్లో కనీసం స్థానిక నాయకులకు పూర్తి స్థాయిలో సమాచారం ఇవ్వకుండా కార్యక్రమాలు చేపడుతున్నారని పార్టీలో పలువురు కార్యకర్తలు గుర్రుగా ఉన్నారు.

దిశ పోలీసు స్టేషన్ ప్రారంభానికి విచ్చేసిన సీఎం జగన్‌కి స్వాగతం పలుకుతూ రాజమండ్రిలో జాతీయ రహదారిపై వైసీపీ పార్లమెంటు నాయకుడు భారీ స్థాయిలో ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. అయితే ఈ ప్లెక్సీలలో యాప్ ఆవిష్కరణ జరుగుతున్న నియోజకవర్గ స్థానిక ప్రజా ప్రతినిధి ఫోటోలను ఉద్దేశపూర్వకంగానే ఆ నాయకుడు ఏర్పాటు చేయలేదంటూ పార్టీలో కార్యకర్తల మధ్య లుకలుకలు ఏర్పడ్డాయి.. దీంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు..

శనివారం సీఎం పర్యటనలోనూ ఆధిపత్య పోరు కొనసాగుతూ పార్టీలో చేరికల విషయంలో.. పలువురు విభేదించిన వారికి పార్టీ కండువాలు వేయించడం పట్ల తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల కాలంలో రాజమండ్రి పార్లమెంటరీలోని ఆయా నియోజకవర్గాల్లో పలు అభివృద్ధి పనులకు సంబంధించి అభివృద్ధి పనుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు, ఆ నాయకుడే చేపడుతున్నారని.. స్థానిక నేతలకు కనీస ప్రాధాన్యం ఇవ్వడం లేదని శ్రేణుల్లో అసంతృప్తితో రగిలిపోతోంది.

టీడీపీ కంచుకోటగా ఉన్న రాజమహేంద్రవరంలో వైసీపీ పాగా వేసుందుకు ప్రయత్నించి గత సాధారణ ఎన్నికల్లో బెడిసికొట్టింది. ఇప్పుడు పార్టీ అధికారంలో ఉండడంతో రాజమండ్రిపై పట్టు సాధించే అవకాశం ఉన్నా.. పార్టీలో అంతర్గత విభేదాలతో మరింత నష్టం జరిగే ప్రమాదం కనిపిస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story