10 Feb 2020 8:39 AM GMT

Home
 / 
క్రీడలు / భారత క్రికెట్‌...

భారత క్రికెట్‌ ప్రేమికులను తీవ్ర నిరాశకు గురిచేసిన అండ‌ర్-19 వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌ ఫైనల్ మ్యాచ్‌

భారత క్రికెట్‌ ప్రేమికులను తీవ్ర నిరాశకు గురిచేసిన అండ‌ర్-19 వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌ ఫైనల్ మ్యాచ్‌
X

ఐసీసీ అండ‌ర్-19 వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌ లీగ్‌ మ్యాచ్‌లో భార‌త్‌ జట్టు జోరు చూసి..ఈ సారి కూడా టైటిల్‌ మనదే అనుకున్నారంతా. లీగ్‌ దశలో కుర్రాళ్ల జైత్రయాత్ర చూసి.. భారత్‌ ఖాతాలో ఐదోసారి కప్‌ చేరడం ఖాయం అని భావించారు. అందులోనూ టైటిల్‌ పోరులో ప్రత్యర్థి బంగ్లా జట్టు కావడం అంచనాలను ఇంకాస్త పెంచింది. కానీ తుది ఫలితం మాత్రం.. క్రికెట్‌ ప్రేమికులను తీవ్ర నిరాశకు గురిచేసింది.. టైటిల్‌ వేటలో భారత్‌ కుర్రాళ్లు చతికిల పడ్డారు. బ్యాటింగ్‌ వైఫల్యంతో ప్రపంచకప్‌ను చేజార్చుకున్నారు. లీగ్‌ దశలో చూపిన జోరును ఫైనల్‌ మ్యాచ్‌లో కనబర్చలేకపోయారు. ఆఖరికి రన్నరప్‌తో సరిపెట్టుకున్నారు.

అండ‌ర్-19 వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లో ఫైనల్‌ వరకు చేరుకున్న భారత్‌కు అనూహ్య ఓట‌మి ఎదురైంది. చివరి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో పరాజయాన్ని మూటగట్టుకుంది. డక్ వర్త్ లూయిస్ పద్ధతిలో 3వికెట్ల‌తో బంగ్లాదేశ్ చేతిలో ఓడిపోయింది. దీంతో ఐదోసారి ప్ర‌పంచ విజేత‌గా నిల‌వాల‌నే భార‌త్ ఆశ‌లు ఆవిర‌య్యాయి. భారత్‌ నిర్దేశించిన 178 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో బంగ్లా విజయానికి 15 పరుగుల దూరంలో ఉండగా వర్షం అంతరాయం కలిగించింది. దీంతో ఫలితాన్ని 30 బంతుల్లో 7 పరుగులుగా నిర్ణయించారు. అనంతరం గ్రౌండ్‌లోకి వచ్చిన బంగ్లా ఆటగాళ్లు 23 బంతుల మిగిలుండగానే విజయాన్నందుకున్నారు.

177 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాజట్టును..ఓపెనర్‌ పర్వేజ్‌ , కెప్టెన్‌ అలీ ఆదుకున్నారు. జట్టుకు విజయాన్నిఅందించడంలో కీలకపాత్ర పోషించారు. బంగ్లా ఓపెనర్‌ పర్వేజ్‌ 47 పరుగులతో కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. ఇక 85 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన బంగ్లాను కెప్టెన్‌ అక్బర్‌ అలీ, ఓపెనర్‌ పర్వేజ్‌లు కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. కెప్టెన్ అక్బర్ అలీ 43 పరుగులతో కడవరకు నిలిచి విజయాన్నందించారు.

అంతకు ముందు టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ 47.2 ఓవర్లలో 177 పరుగులకే ఆలౌట్‌ అయింది. టోర్నీ ఆసాంతం వరుస విజయాలతో తుదిపోరుకు దూసుకొచ్చిన భారత్‌.. ఫైనల్లో మాత్రం ఆశించిన స్థాయిలో రాణించలేదు. యువ సంచలనం యశస్వి జైస్వాల్‌ 88 పరుగులతో మరోసారి అద్భుతమైన ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. తిలక్ వర్మ 38 పరుగులు చేసి ఫర్వాలేదనిపించాడు.మిగితా బ్యాట్స్‌మెన్‌ అంతా తక్కువ పరుగులకు పెవిలియన్‌ చేరారు. దీంతో భారత్‌ బంగ్లా ముందు నామమాత్రపు లక్ష్యాన్ని ఉంచింది. ఇక భారత బౌలర్లు.. తక్కువ స్కోరును కాపాడుకోవడంలో పూర్తిగా విఫలమయ్యారు. వారు ఎక్స్‌ట్రాల రూపంలోనే 33 పరుగులు సమర్పించుకోవడం శోచనీయం. ఇక భారత బౌలర్‌ రవి బిష్ణోయ్‌ 4 వికెట్లు తీసి అద్భుతంగా రాణించాడు. ఒకానొక దశలో బిష్ణోయ్‌ భారత విజయంపై ఆశలు రేపాడు. ఐనా విజయాన్ని మాత్రం అందుకోలేకపోయారు.

బ్యాటింగ్, బౌలింగ్‌లో సమష్టిగా చెలరేగిన బంగ్లా జట్టు ఎట్టకేలకు ఐసీసీ టైటిల్‌ను ముద్దాడింది. దీంతో త‌మ క్రికెట్ చ‌రిత్ర‌లో నూత‌న అధ్యాయాన్ని లిఖించింది.ఇక వరుస విజయాలతో దూసుకెళ్లిన యువ భారత్ తుది సమరంలో మాత్రం ఒత్తిడికి చిత్తయింది. బ్యాటింగ్, బౌలింగ్‌లో మూకుమ్మడిగా విఫలమై రన్నరప్‌తో సరిపెట్టుకుంది. ఏడుసార్లు ఫైన‌ల్ చేరిన భార‌త్ నాలుగుసార్లు విజేత‌గా నిల‌వ‌గా.. తాజా ఫ‌లితంలో క‌లిపి మూడుసార్లు ర‌న్న‌ర‌ప్‌గా నిలిచింది.

Next Story