ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ పై ఎలక్షన్ కమిషన్ తుది వివరాలు
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ పై ఎలక్షన్ కమిషన్ తుది వివరాలు ప్రకటించింది. ఈసారి ఎన్నికల్లో 62.59 శాతం పోలింగ్ నమోదైనట్టు ఈసీ వెల్లడించింది. 2015 ఎన్నికల్లో 67.12 శాతం పోలింగ్ నమోదు కాగా.. ఈసారి 5 శాతం తక్కువ పోలింగ్ నమోదైంది. అయితే, గత లోక్ సభ ఎన్నికల కంటే ఇది 2 శాతం ఎక్కువని ఈసీ తెలిపింది. ఇక నియోజవర్గాల వారిగా చూస్తే.. ఢిల్లీ కంటోన్మెంట్ సెగ్మెంట్ లో అతి తక్కువగా 45 శాతం పోలింగ్ నమోదు కాగా.. బల్లిమరాన్ సెగ్మెంట్ లో 71.60 శాతం పోలింగ్ నమోదైంది.
ఈవీఎంలన్నీ సేఫ్ గా వున్నాయని, స్ట్రాంగ్ రూంల వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశామని ఈసీ స్పష్టం చేసింది. అటు పోలింగ్ తుది వివరాలు ఆసల్యంగా ప్రకటించడంపైనా ఈసీ స్పందించింది. ప్రిసైడింగ్ ఆఫీసర్స్ నుంచి వివరాలు రాకపోవడం వల్లే ప్రకటన ఆసల్యమైందని స్పష్టం చేసింది.
ఇదిలావుంటే, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి.. పోలింగ్ వివరాలు ఆలస్యం కావడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈసీ అధికారులు ఇన్ని రోజులూ నిద్రపోతున్నారా అని మండిపడ్డారు. అయితే, కేజ్రీవాల్ ఆగ్రహం వ్యక్తం చేసిన కొన్ని గంటల్లోనే యాదృచ్ఛికంగా ఈసీ అధికారులు పోలింగ్ వివరాలు ప్రకటించడం చర్చనీయాంశమైంది.
మరోవైపు ఢిల్లీ ఎన్నికల్లో ఓటర్లను మభ్యపెట్టేందుకు పార్టీలు పెద్ద మొత్తంలో డబ్బు, మద్యం పంపిణీకి పాల్పడినట్టు ఎన్నికల కమిషన్ వెల్లడించింది. ఈ ఎన్నికల్లో దాదాపు 57 కోట్ల విలువైన నగదు, డ్రగ్స్, మద్యాన్ని స్వాధీనం చేసుకున్నామని తెలిపింది. ఇందులో 12.33 కోట్ల నగదు ఉండగా, 2.83 కోట్ల విలువైన మద్యం, అత్యధికంగా 42.32 కోట్ల విలువైన మాదకద్రవ్యాలు, ఆభరణాలు ఉన్నట్టు తెలిపింది. ఇవి 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో స్వాధీనం చేసుకున్న దాని కంటే రెండు రెట్లు ఎక్కువని ఈసీ పేర్కొంది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com