ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశ పెట్టడంలో ఇరాన్ మరోసారి విఫలం

ఇరాన్ వెనక్కి తగ్గడం లేదు. అమెరికాపై ప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్న ఇరాన్, క్షిపణి-ఉపగ్రహ ప్రయోగాలతో దూకుడు ప్రదర్శిస్తోంది. తాజా ఇరాన్‌లోని రివల్యూష నరీ గార్డ్స్ అధునాతన బాలిస్టిక్ క్షిపణిని ఆవిష్కరించింది. రాద్-500 అనే క్షిపణిలో జొహెయిర్ ఇంజిన్‌ను అమర్చారు. మిశ్రమ పదార్థాలతో ఈ ఇంజిన్ తయారైంది. ఉక్కుతో రూపొందిన ఇతర ఇంజిన్ల కన్నా తేలిగ్గా ఉంటుంది. ఈ మిస్సైల్ 500 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదు. న్యూ మిస్సైల్‌లో కొత్త తరం ఇంజిన్లు ఉన్నాయని, ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టేందుకు రూపొందించామని రివల్యూషనరీ గార్డ్స్ తెలిపింది. ఇరాన్ క్షిపణి అణు కార్యక్రమాలపై అమెరికా కఠిన ఆంక్షలు విధించిన నేపథ్యంలో ఇరాన్ మిస్సైల్ టెస్ట్ చర్చనీయాంశమైంది.
ఇదిలా ఉంటే, ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టడంలో ఇరాన్ మళ్లీ విఫలమైంది. నింగిలోకి రాకెట్ విజయవంతంగానే దూసుకెళ్లినప్పటికీ, జఫర్ ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టడంలో మాత్రం సక్సెస్ కాలేకపోయింది. ఇరాన్ ఉపగ్రహ ప్రయోగం విఫలం కావడం వరుసగా ఇది నాలుగోసారి. 2019 నాటి ప్రయోగంలో రాకెట్ అనుకున్న వేగం అందుకోకపోవడంతో మధ్యలోనే కుప్పకూలింది. ఫిబ్రవరి, ఆగస్టులలో జరిగిన ఎక్స్‌పెరిమెంట్లు కూడా ఫెయిలయ్యయి. ఐతే, ప్రయోగం విఫలమైనప్పటికీ తమ మిషన్ మాత్రం ఆగబోదని ఇరాన్ ప్రభుత్వం ప్రకటించింది. ఇరాన్ ప్రయత్నాలను అమెరికా తీవ్రంగా తప్పుపట్టింది. దీర్ఘశ్రేణి బాలిస్టిక్ క్షిపణి సాంకేతికతను సమకూర్చుకోవడానికి ఇరాన్ ప్రయోగాలు చేస్తోందని ఆరోపించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com