విదేశాల్లో విద్యకు 'టాటా' సాయం.. స్కాలర్‌షిప్ రూ. లక్ష నుంచి పదిలక్షల వరకు..

విదేశాల్లో విద్యకు టాటా సాయం.. స్కాలర్‌షిప్ రూ. లక్ష నుంచి పదిలక్షల వరకు..

చదువులో ప్రతిభ చూపిస్తూ.. విదేశాల్లో చదువుకోవాలనే ఆసక్తి ఉన్న అభ్యర్ధులకు ఆర్థిక సాయాన్ని అందిస్తామంటోంది టాటా సంస్థ. జేఎన్ టాటా ఎండోమెంట్ లోన్ స్కాలర్‌షిప్ అందిస్తోంది. ఇందుకు సంబంధించిన ప్రకటన ఇటీవలే విడుదలైంది. అభ్యర్ధులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఎంపికైన వారికి రూ.లక్ష నుంచి రూ.పది లక్షల వరకు పొందే అవకాశం ఉంది. విదేశాల్లో ఫుల్‌టైం పోస్ట్‌గ్రాడ్యుయేట్/పీహెచ్‌డీ/పోస్ట్ డాక్టోరల్ స్టడీస్/రీసెర్చ్ ఫెలోషిప్‌లకు ఎంపికైనవారు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్ధి అవసరాన్ని బట్టి స్కాలర్‌షిప్ నిర్ణయిస్తారు.

చదువు సంబంధించిన మొత్తం ఖర్చుని మాత్రం భరించరు. అర్హత: ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి 60% మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. డిగ్రీ తుది సంవత్సరం చదువుతున్నవారూ అర్హులే. వయసు జూన్ 30,2020 నాటికి 45 ఏళ్లు మించకూడదు. దరఖాస్తుల ఆధారంగా ప్రాథమిక ఎంపిక ప్రక్రియ పూర్తయ్యాక ఆన్‌లైన్ పరీక్ష నిర్వహిస్తారు.

దీనిలో అర్హత సాధించిన వారిని ఇంటర్వ్యూకు పిలుస్తారు. దీనిలోనూ అర్హత సాధించాల్సి ఉంటుంది. ఈ వడపోతల ప్రక్రియ అంతా ముగిసిన తరువాత స్కాలర్‌షిప్ అందజేస్తారు. మరిన్ని వివరాలకు వెబ్‌‌సైట్ http://www.jntataendowment.org చూడొచ్చు. దరఖాస్తుకు చివరి తేదీ: మార్చి 9,2020.

Tags

Next Story