ఆంధ్రప్రదేశ్ నుంచి వెనుదిరిగి పోతున్న పెట్టుబడిదారులు

ఏపీలో పెట్టుబడులు రోజురోజుకి దిగజారిపోతున్నాయి. ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం తీసుకుంటోన్న నిర్ణయాలతో గత మే నుంచి పెట్టుబడిదారులు ఆంధ్రప్రదేశ్ నుంచి వెనుదిరిగి పోతున్నారు. విద్యుత్ ఉత్పాదన సంస్థలతో ఆంధ్రప్రదేశ్‌లో ఈ పరిస్థితి ప్రారంభమైంది. పీపీఏల పునఃసమీక్షలతో మొదలైన పెట్టుబడుల పతనం ఇప్పటికీ కొనసాగుతోంది. గత మే నుంచి చూస్తే నవయుగ ఇంజనీరింగ్‌కు 3 వేల 217 కోట్ల పోలవరం కాంట్రాక్ట్ రద్దు కాగా, నెల్లూరు జిల్లాలో సెజ్ ఏర్పాటు కోసం నవయుగ గ్రూప్‌నకు కేటాయించిన 4 వేల 731 ఎకరాల భూ కేటాయింపులను ఏపీ సర్కార్ రద్దు చేసింది.
అలాగే కర్నూలు జిల్లాలో సోలార్ ఎనర్జీ ప్లాంట్ కోసం గ్రీన్‌కో గ్రూపునకు కేటాయించిన భూకేటాయింపులు రద్దు కాగా, విశాఖలో వాణిజ్య సముదాయం కోసం లులు గ్రూప్‌నకు కేటాయించిన 11 ఎకరాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. ఇక అనంతపురం జిల్లాలో 1.1 బిలియన్ డాలర్ల పెట్టుబడితో ప్రారంభించిన కియా మోటర్స్ ప్లాంట్ తరలిపోనున్నదని వార్తలు ఇటీవల వచ్చాయి. అలాగే విశాఖపట్నంలో ఏర్పాటు కానున్న అదానీ గ్రూప్ డేటా సైన్సెస్ సెంటర్ ప్రతిపాదన కూడా ఉపసంహరించుకున్నారు. ఇవన్నీ కలిపి ఇప్పటికీ 1.5 లక్షల కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలు ఉపసంహరించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com