తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగా చల్లబడిన వాతావరణం

తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగా చల్లబడిన వాతావరణం

ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ఆకాశమంతా మేఘావృతమై అక్కడక్కడా వర్షాలు పడుతున్నాయి. కొన్నిచోట్ల ముసురు పెట్టింది. నిన్నటి నుంచి పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. రెండు రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావారణ శాఖ అధికారులు తెలిపారు. తమిళనాడు నుంచి ఛత్తీస్‌గఢ్ వరకూ ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది.. ప్రస్తుతం ద్రోణి 900 మీటర్ల ఎత్తులో కొనసాగుతోంది. దీని ప్రభావంతో వచ్చే 24 గంటల్లో పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.

నల్గొండ జిల్లా మిర్యాలగూడలో అకాల వర్షంతో జనజీవనం స్తంభించిపోయింది. చెరువులు కుంటల్లోకి వరద నీరు చేరింది. హనుమపేటలో ఇళ్లలోకి వరద నీరు చేరి కాలనీలు జలమయం అయ్యాయి. అటు ఏపీలోనూ వర్షాలు కురిశాయి. కృష్ణా జిల్లా కంకిపాడు మండలంలోని పలు గ్రామాల్లో భారీ వర్షం కురిసింది. పలుచోట్ల రహదారులపై నీరు చేరి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

మహబూబాబాద్‌ జిల్లాలోని కురవి, మరిపెడ మండలాల్లో అకాల వర్షం రైతులకు అపార నష్టాన్ని మిగిల్చింది.. కళ్లాల్లో ఉన్న మిర్చి పంట పూర్తిగా తడిసి ముద్దయింది.. దీంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం స్పందించి తడిసిన మిర్చికి గిట్టుబాటు ధర కల్పించి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రాత్రి కురిసిన అకాల వర్షానికి మిర్చి పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది.. పాలేరు నియోజకవర్గంలో పంట చేతికొచ్చే దశలో గాలివాన రైతును నిండా ముంచింది.. గత ఏడాది నకిలీ విత్తనాలతో, ఈ ఏడాది వైరస్‌తో తీవ్రంగా నష్టపోయిన రైతులను అకాల వర్షం తీరని నష్టం మిగిల్చింది. తడిసిన మిర్చి పంటను చూసి రైతులు గుండెలు బాదుకుంటున్నారు.

క్యుములో నింబస్ మేఘాల ప్రభావంతో ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, శ్రీకాకుళం, విశాఖపట్నం, తూర్పు గోదావరి జిల్లాల్లో వర్షం కురిసింది. అకాల వర్షం కారణంగా పత్తి, మిర్చి పంటలకు నష్టం వాటిళ్లింది. దీంతో రైతులు ఆందోళనలు చెందుతున్నారు. ఒక్కరోజు కురిసిన వర్షానికి కొన్ని ప్రాంతాల్లోని రోడ్లు బురదమయం అయ్యాయి.

Tags

Next Story