వెలగపూడిలో 151 గంటల దీక్ష చేస్తున్న ఇద్దరి ఆరోగ్యం క్షీణించింది
వెలగపూడిలో 151 గంటల దీక్ష చేస్తున్న ఇద్దరి ఆరోగ్యం క్షిణించింది. బీపీ, షుగర్ లెవల్స్ పడిపోవడంతో రాజధాని గ్రామాల ప్రజలు ఆందోఒళన వ్యక్తం చేస్తున్నారు. అమరావతినే రాజధానిగా ప్రకటిస్తూ ఏపీ ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేసే వరకు దీక్ష విరమించేది లేదని యువకులు స్పష్టం చేస్తున్నారు. అటు మహిళలు కూడా దీక్షా శిబిరాల్లోనే ఉంటున్నారు. జై అమరావతి నినాదాలతో హోరెత్తిస్తున్నారు. దాదాపు రెండు నెలలుగా నిద్రాహారాలు మాని దీక్ష చేస్తుంటే ముఖ్యమంత్రి జగన్ స్పందించకపోవడంపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
మందడంలోనూ ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడుతోంది. అమరావతి రాజధానిగా కొనసాగాలని.. రైతులు, మహిళలు 54వ రోజు కూడా ఆందోళనలు కొనసాగించారు. ఒక్క వైసీపీ తప్ప అన్ని రాజకీయ పార్టీలు వారికి మద్దతు పలికాయి.
అమరావతే రాజధానిగా కొనసాగాలని రైతులతో పాటు ఎన్‌ఆర్‌ఐలు కూడా డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే అమెరికా సహా ఇతర దేశాల్లోనూ ఏపీ రాజధాని రైతులకు మద్దతుగా నిరసనలు తెలుపుతున్నారు. ఇప్పుడు నేరుగా రైతులు దీక్ష చేస్తున్న ప్రదేశానికి వచ్చి ఎన్‌ఆర్‌ఐలు మద్దతు తెలిపారు. అమెరికా నుంచి వచ్చిన తానా ప్రతినిధులు సతీష్ వేమన, కోమటి జయరాం రాజధాని రైతులకు తమ మద్దతు ప్రకటించారు.
అమరావతి రైతులకు మద్దతుగా రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి.. తూర్పు గోదావరి జిల్లా రావులపాలెంలో అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ జరిగింది. పెద్ద సంఖ్యలో రైతులు, మహిళలు, యువకులు సభకు హాజరయ్యారు.
అమరావతి రైతుల ఆందోళనకు గుంటూరు జిల్లా అప్పికట్ల ఆడపడుచులు సంఘీభావం ప్రకటించారు. ఇక్కడ కొలువైన అమ్మవారికి పొంగళ్లు సమర్పించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మనసు మార్చాలని అమ్మవారిని వేడుకున్నారు. అప్పికట్లలోని ఎన్టీఆర్ విగ్రహం నుండి అమ్మవారి ఆలయం వరకు మహిళలు ప్రదర్శన నిర్వహించారు.
అమరావతి రైతులకు హైదరాబాద్‌లో నివసిస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా సంఘీభావం ప్రకటించారు. అమరావతి ఉద్యమానికి నిజాంపేటవాసులు మద్దతు పలికారు. అమరావతిలోనే రాజధాని ఉంచుతామని ప్రభుత్వం ప్రకటించేవరకు ఉద్యమం ఆపే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. అమరావతి ఉద్యమానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా మద్దతు తెలపాలని విజ్ఞప్తి చేశారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com