అమరావతి ఉద్యమం.. చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించిన చంద్రబాబు

అమరావతి ఉద్యమం.. చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించిన చంద్రబాబు

అమరావతి ఉద్యమం మహోగ్రంగా సాగుతోంది. ప్రాణాలు ఇచ్చేందుకైనా సిద్ధం అంటున్నారు యువత, విద్యార్థులు. 151 గంటల దీక్ష చేపట్టిన ఇద్దరు యువ రైతులతోపాటు.. ANU దాడిలో గాయపడిన విద్యార్థులు విజయవాడ హెల్ప్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. విద్యార్థులను పరామర్శించిన చంద్రబాబు..జగన్ తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

తాము ఇంకా దీక్ష విరమించలేదని స్పష్టం చేశారు అమరావతి యువకులు శ్రీకర్, రవిచంద్ర. ఈ ఇద్దరూ అమరావతి కోసం వెలగపూడిలో 151 గంటల దీక్షకు దిగారు. ఆరోగ్యం క్షీణించడంతో ఆదివారం అర్ధరాత్రి ఇద్దరినీ అరెస్ట్ చేసి గుంటూరు గవర్నమెంట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు పోలీసులు. ఇంటికి చేరుకున్న శ్రీకర్, రవిచంద్ర.. దీక్ష కొనసాగిస్తున్నారు. అమరావతి కోసం ప్రాణత్యాగానికైనా సిద్ధమని ప్రకటించారు. వీరి ఆరోగ్యం విషమంగా ఉండటంతో విజయవాడలోని హెల్ప్ ఆస్పత్రికి తీసుకెళ్లారు.

పోలీసులు ఆదివారం రాత్రి 2 గంటలపాటు వాహనంలో తిప్పిన తర్వాత ఆస్పత్రికి తీసుకెళ్లారని ఆరోపించారు శ్రీకర్, రవిచంద్ర. శాంతియుతంగా ధర్నా చేస్తుంటే అరెస్ట్‌ చేసి..దారుణంగా వ్యవహరించారని అన్నారు. ఏం తప్పు చేశామని ఇంత కక్షతో వ్యవహరిస్తున్నారంటూ మండిపడ్డారు.

శ్రీకర్, రవిచంద్ర పరిస్థితి ప్రస్తుతం ఇబ్బందికరంగానే ఉందని అందుకే ICUలో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. యూరిక్ ఆసిడ్ బాగా పెరిగిందని.. సోడియం, పొటాషియం లెవల్స్ తక్కువగా ఉన్నాయని చెప్పారు.

అమరావతి కోసం ఉద్యమిస్తున్న తమను వీసీ వేధిస్తున్నారని ఆరోపించారు నాగార్జున యూనివర్సిటీ విద్యార్థులు. వర్సిటీలో జరిగిన దాడితో అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుంతుంటే ..సస్పెండ్ చేస్తామంటూ బెదిరిస్తున్నారని వాపోయారు.

ANU విద్యార్ధులపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు టీడీపీ అధినేత చంద్రబాబు. విజయవాడలోని హెల్ప్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న స్టూడెంట్స్‌ను ఆయన పరామర్శించారు. వీసీ ప్రవర్తన దారుణంగా ఉందన్నారు. 3 రాజధానులపై పెట్టిన చర్చలో తమ అభిప్రాయాలు చెబితే దాడులు చేయిస్తారా అని నిలదీశారు. అమరావతి ఉద్యమంలో యువరైతులతోపాటు.. విద్యార్థులు చురుగ్గా పాల్గొంటున్నారు. రాజధానిని కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story