పోలవరంపై కేంద్రం కీలక ప్రకటన

పోలవరంపై కేంద్రం కీలక ప్రకటన
X

ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరంపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. ప్రాజెక్ట్‌ నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు గడువును 2021 డిసెంబర్‌ వరకు పొడిగిస్తున్నట్లు వెల్లడించింది. రాజ్యసభలో బీజేపీ ఎంపీ సుజనా చౌదరి అడిగిన ప్రశ్నకు కేంద్ర జలశక్తి శాఖ సహాయ మంత్రి రతన్‌లాల్ కటారియా లిఖిత పూర్వక సమాధానమిచ్చారు. వాస్తవానికి 2019నాటికి పూర్తి కావాల్సి ఉన్నా.. ఆ గడువును 2021 వరకు పెంచినట్లు తెలిపారు. కాంట్రాక్టు నిర్వహణ కారణాలతో గడువు పెంచినట్లు ఆయన స్పష్టం చేశారు. గతేడాది నవంబర్‌ 26నే ఈ విషయాన్ని లేఖ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి తెలిపామన్నారు.

మరో వైపు పోలవరం ప్రాజెక్టు పెండింగ్‌ నిధుల విడుదలపైనా కేంద్రం క్లారిటీ ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వ ఆడిట్ పూర్తయ్యే వరకు నిధుల విడుదల సాధ్యం కాదని తేల్చి చెప్పింది. ఈ నెలలోనే రూ.1850 కోట్లు విడుదల చేసినట్లు కేంద్ర మంత్రి తెలిపారు. పోలవరం ప్రాజెక్టు అథారిటీ సెంట్రల్ వాటర్ కమిషన్ ప్రతిపాదనల మేరకు ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం రూ.8614 కోట్లు ఇచ్చినట్లు వెల్లడించారు.

అటు ఏపీ ప్రభుత్వం కూడా ఎట్టిపరిస్థితుల్లోనూ 2021నాటికి పోలవరం ప్రాజెక్ట్‌ను పూర్తి చేస్తామని చెబుతోంది. ఇప్పటికే రివర్స్ టెండరింగ్ చేపట్టింది. పనుల్ని కూడా ముమ్మరం చేశామని చెప్పుకోస్తోంది. అయితే వాస్త పరిస్థితుల్లో పోలవరం పనులు ఆగిపోయాయని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. వైసీపీ ప్రభుత్వం వచ్చాక కనీసం తట్ట సిమెంట్‌ పనులు కూడా జరగలేదని విమర్శలు వెల్లువెత్తున్నాయి.

Tags

Next Story