పార్లమెంట్‌ను కుదిపేసిన రిజర్వేషన్ల అంశం

రిజర్వేషన్ల అంశం పార్లమెంట్‌ను కుదిపేసింది. SC-ST రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు తీర్పుపై లోక్‌సభ అట్టుడికింది. ఉద్యోగ నియామకాలు, పదోన్నతుల్లో రిజర్వేషన్లు ప్రాథమిక హక్కు కాదంటూ సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పుపై లోక్ సభలో ప్రతిపక్షాలు ఆందోళన చేపట్టాయి. రిజర్వేషన్లను నీరుగార్చడానికి కేంద్రం ప్రయత్నిస్తోందని ఆరోపించాయి. ఈ అంశంపై వెంటనే చర్చ చేపట్టాలని డిమాండ్ చేశాయి. సుప్రీం తీర్పుపై నిరసన తెలిపిన విపక్షాలు, రిజర్వేషన్లను నిర్వీర్యం చేయవద్దని సూచించాయి. వెనకబడిన వర్గాలకు అన్యాయం చేయవద్దని ప్రతిపక్ష సభ్యులు నినదించారు. విపక్షాల ఆరోపణలపై ప్రభుత్వం తీవ్రంగా మండిపడింది. రిజర్వేషన్లను నీరుగార్చే ఉద్దేశం తమకు లేదని స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు తీర్పు ఇస్తే తమపై ఆరోపణలు చేయడం సరికాదని ఎదురుదాడి చేసింది. అధికార, విపక్షాల మధ్య మాటలయుద్ధంతో సభలో తీవ్ర గందరగోళం చెలరేగింది.
రిజర్వేషన్లను పూర్తిగా తొలగించడమే బీజేపీ ఉద్దేశమని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. RSS సూచనలకు అనుగుణంగా మోదీ సర్కారు నడుచుకుంటోందని విమర్శించారు. రాహుల్ గాంధీ ఆరోపణలను బీజేపీ తిప్పికొట్టింది. రిజర్వేషన్లకు తాము కట్టుబడి ఉన్నామని స్పష్టం చేసింది. RSS కూడా రిజర్వేషన్లకు వ్యతిరేకం కాదని తేల్చి చెప్పింది.
© Copyright 2023 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com