మండలి సెక్రటరీని వైసీపీ ప్రభుత్వం బెదిరిస్తోంది : టీడీపీ ఎమ్మెల్సీలు
ఏపీలో సెలెక్ట్ కమిటీ వ్యవహారం రాజకీయ కాక రేపుతోంది.. సెలెక్ట్ కమిటీ విషయంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై టీడీపీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతోంది.. బిల్లులు సెలెక్ట్ కమిటీకి వెళ్తే ఓడిపోతామన్న భయం ప్రభుత్వానికి పట్టుకుందంటూ టీడీపీ విమర్శిస్తోంది.. మండలి ఛైర్మన్ చెప్పిన ఆదేశాలనూ సెక్రటరీ పాటించే పరిస్థితి కనిపించడం లేదని.. మండలి సెక్రటరీపై ప్రభుత్వం ఒత్తిడి తెస్తోందని ఫైరవుతోంది. బిల్లులు సెలెక్ట్ కమిటీకి వెళ్తే భయం ఎందుకని యనమల రామకృష్ణుడు ప్రశ్నించారు.. బిల్లులను తాము అడ్డుకోలేదని, సవరణలు మాత్రమే సూచించామని అన్నారు.
అటు శాసన మండలి సెక్రటరీని టీడీపీ ఎమ్మెల్సీలు కలిశారు. ఛైర్మన్ ఆదేశాలను సెక్రటరీ పక్కన పెట్టారని వారు ఆరోపించారు. సెలెక్ట్ కమిటీ వేయాలని రూల్ నెంబర్ 154 ప్రకారం ప్రకటన చేసినప్పటికీ అమలు చేయలేదన్నారు.. వైసీపీ ప్రభుత్వం అధికార దుర్వినియోగం చేస్తోందని.. దీనిపై న్యాయపోరాటం చేస్తామని.. గవర్నర్‌ను కూడా కలుస్తామని టీడీపీ ఎమ్మెల్సీలు చెప్పారు.
శాసన మండలి సెక్రటరీని వైసీపీ ప్రభుత్వం, ఆ పార్టీ నేతలు బెదిరించారని టీడీపీ ఎమ్మెల్సీలు ఆరోపించారు. ఆయనలో ఆందోళన, భయం కనిపిస్తోందన్నారు. మండలి ఛైర్మన్ ఆదేశాలను అమలుచేయకపోతే.. సెక్రటరీకి ధిక్కరణ నోటీసు ఇవ్వాలని నిర్ణయించారు. టీడీపీ, బీజేపీ, పీడీఎఫ్ ఎమ్మెల్సీలు మండలి సెక్రటరీని కలిశారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com