- Home
- /
- ఆంధ్రప్రదేశ్
- /
- అమరావతి ఉద్యమాన్ని కొనియాడిన...
అమరావతి ఉద్యమాన్ని కొనియాడిన చంద్రబాబునాయుడు

రాష్ట్ర ప్రజలు తమ రాజధాని ఎక్కడో చెప్పుకునే పరిస్థితి లేకుండా పోతుందనే ఆందోళన ప్రతి రైతులోనూ వ్యక్తమవుతోంది. ఏపీకి ఒకటే రాజధాని ఉండాలి.. అది కూడా అమరావతే కావాలని రైతులు, మహిళలు నినదిస్తున్నారు. 56 రోజులుగా ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడుతున్నా.. వారిలో అలుపన్నది ఏమాత్రం కనిపించడం లేదు.
అమరావతి ఉద్యమాన్ని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొనియాడారు. విజయవాడలో నిర్వహించిన టీడీపీ నేతల విస్తృతస్థాయి సమీక్షా సమావేశంలో పాల్గొన్న చంద్రబాబు.. అమరావతి మహిళల ధైర్య సాహసాలను మెచ్చుకున్నారు. 1984 పోరాటంలో ఎమ్మెల్యేలు హీరోలైతే.. నేడు ఎమ్మెల్సీలు హీరోలయ్యారని కొనియాడారు. అమరావతిలో ల్యాండ్ పూలింగ్ తప్పన్న వైసీపీ, ఇప్పుడు వైజాగ్‌లో ల్యాండ్ పూలింగ్ చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కష్టపడి తెచ్చిన పరిశ్రమలన్నీ తరలిపోయే పరిస్థితి రావడంపై చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితికి వైసీపీ ప్రభుత్వమే కారణమన్నారు.
రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ 151 గంటల దీక్ష కొనసాగిస్తున్న రాజధాని ప్రాంత యువకులు విజయవాడ హెల్ప్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.. వారిని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పరామర్శించారు.. వారి ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. జగన్ ఓ మూర్ఖుడిలా ప్రవర్తిస్తున్నారని లోకేష్ మండిపడ్డారు.. ప్రపంచంలో ఎక్కడా మూడు ముక్కల రాజధాని విజయవంతం కాలేదన్నారు..
అమరావతి సాధనే లక్ష్యంగా ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడుతోంది. ప్రభుత్వం దిగివచ్చేవరకు ఉద్యమాన్ని ఆపేదిలేదని రైతులు తెగేసి చెబుతున్నారు. దీంతో రోజురోజుకూ ఉద్యమం ముదురుతుండటంతో అధికార పార్టీలో కలవరం మొదలైంది.
© Copyright 2023 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com