కలెక్టర్ వ్యవస్థ బలోపేతం చేస్తాం: సీఎం కేసీఆర్

కలెక్టర్ల వ్యవస్థను బలోపేతం చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని.. ప్రగతిభవన్‌లో జరుగుతున్న కలెక్టర్ల సదస్సులో సీఎం కేసీఆర్ అన్నారు. కలెక్టర్లకు అండగా ఉండటం కోసమే అడిషనల్ కలెక్టర్లను నియమించామన్నారు. గతంలో 112 కమిటీలకు కలెక్టర్లు చైర్మన్‌గా ఉండేవారని.. వారిపై ఒత్తిడిని తగ్గించేందుకు 26 విభాగాలుగా మార్చామన్నారు. గ్రామాల్లో మార్పు కోసం ప్రభుత్వం చేయాల్సిందంతా చేసిందని కలెక్టర్లతో భేటీలో కేసీఆర్ తెలిపారు. ఎవరి బాధ్యతలు వారు నెరవేర్చే విధంగా పని చేయించే బాధ్యత కలెక్టర్లు తీసుకోవాలన్నారు.
అడిషనల్ కలెక్టర్ కేవలం స్థానిక సంస్థల బాధ్యతలు మాత్రమే నిర్వహించాలన్నారు కేసీఆర్. గ్రామాల్లో అత్యవసర పనుల కోసం కలెక్టర్ వద్ద కోటి రూపాయలు అందుబాటులో ఉంచుతామన్నారు. ఏ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమమైనా ఎస్సీ, ఎస్టీ ప్రాంతాల నుంచే ప్రారంభం కావాలన్నారు. ఇక నుంచి గ్రేటర్ హైదరాబాద్‌కు నెల 78 కోట్లు, రాష్ట్రంలోని మిగతా పట్టణాలు, నగరాలకు కలిపి 70 కోట్లు విడుదల చేస్తామన్నారు కేసీఆర్.
వనస్థలిపురంలోని హరిణివనస్థలిని.. కేబీఆర్ పార్క్‌లా తయారు చేయాలన్నారు సీఎం. సముద్రం ఒడ్డున నగరాల్లో కాలుష్యం పెరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నారు. హైదరాబాద్ నగరాన్ని నిర్లక్ష్యం చేస్తే కాలుష్య కాసారం కాక తప్పదన్నారు కేసీఆర్. డీజిల్ వాహనాలు తగ్గించి ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్య పెంచే చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com