ఏపీలో ప్రతిధ్వనిస్తున్న 'సేవ్ అమరావతి' నినాదం

ఏపీలో ప్రతిధ్వనిస్తున్న సేవ్ అమరావతి నినాదం

పోలీసులు అడ్డుకుంటున్నా లెక్క చేయడం లేదు. ప్రాణాలు పోతున్నా వెనకడుగు వేయడం లేదు. ఎన్నో ఉద్యమాలను స్ఫూర్తిగా తీసుకుని అమరావతి కోసం 29 గ్రామాల రైతులు పోరాటం చేస్తున్నారు. 57 రోజులుగా కొనసాగుతున్న అమరావతి పోరు రోజురోజుకూ మహోగ్రంగా మారుతోందే తప్ప.. ఎక్కడా తగ్గడం లేదు. అమరావతి కోసం ఎందాకైనా అంటూ రైతులు, మహిళలు, వృద్ధులు నినదిస్తున్నారు.

రాజు మారినప్పుడల్లా రాజధానిని మార్చేస్తారా..? 57 రోజులుగా రాజధాని ప్రాంత రైతులు జగన్ ప్రభుత్వాన్ని ఇదే ప్రశ్నించారు. ప్రశ్నిస్తూనేవున్నారు. ఇదొక్కటే కాదు.. ప్రభుత్వం సమాధానం చెప్పలేని, విశ్లేషకులే విస్తుపోయేలా రాజధాని ప్రజలు ఎన్నో ప్రశ్నలు సంధిస్తున్నారు. తమ ఆవేదనను రోజుకో రూపంలో తెలియజేస్తున్నారు.

57వ రోజు కూడా రాజధాని ప్రాంతంలోని 29 గ్రామాలు గళమెత్తాయి. యువకులు, మహిళలు, వృద్ధులతో దీక్షా శిబిరాలు హోరెత్తాయి. సేవ్ అమరావతి నినాదం మారుమోగింది. మందడం, తుళ్లూరు, వెలగపూడి, పెదపరిమి, కృష్ణాయపాలెం సహా రాజధాని గ్రామాల్లో దీక్షలు ఉధృతంగా సాగాయి.

57వ రోజున కూడా ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడింది. తాడికొండ అడ్డరోడ్డు వద్ద.. మహిళలు భారీగా మానవహారం ఏర్పాటు చేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రభుత్వం తన నిర్ణయంపై వెనక్కి తగ్గే వరకు ఆందోళనలు విరమించేది లేదన్నారు.

ప్రజావ్యతిరేక పాలన సాగిస్తున్న సీఎం జగన్ తీరుకు నిరసనగా.. అనంతపురం జిల్లా కదిరిలో జేఏసీ నాయకులు వినూత్నరీతిలో నిరసన తెలిపారు. రాష్ట్రంలో జగన్ రివర్స్ పాలన సాగిస్తున్నారంటూ.. వెనక్కి నడుస్తూ నిరసన తెలిపారు. సీఎం జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

అమరావతి ఉద్యమంలో అరెస్టై నందిగామ సబ్‌ జైల్లో ఉన్న యువకులను టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పరామర్శించారు. ఈ సందర్భంగా టీడీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున సబ్‌జైల్‌ వద్దకు తరలివచ్చారు. సబ్‌ జైల్లో యువకులను పరామర్శించాక.. అక్రమ అరెస్టులకు నిరసనగా చేపట్టిన ర్యాలీలో లోకేష్ పాల్గొన్నారు. నందిగామలో అమరావతి జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దీక్షా శిబిరానికి వెళ్లి సంఘీభావం తెలిపారు. రాజధానిగా అమరావతినే కొనసాగించాలని.. డిమాండ్ చేశారు లోకేష్‌.

ఆంధ్రప్రదేశ్‌లో ప్రజల రక్తం పీల్చేలా వైసీపీ ప్రభుత్వ పాలన సాగుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. రియల్‌ ఎస్టేట్ వ్యాపారం చేసుకునేందుకే విశాఖపట్నానికి రాజధాని తరలిస్తున్నారని విమర్శించారు. అవినీతి తప్ప.. రాష్ట్ర ప్రభుత్వానికి వేరే ఆలోచనే లేకుండా పోయిందని కన్నా ఘాటు వ్యాఖ్యలు చేశారు.

మరోవైపు అమరావతిని రక్షించాలంటూ దేవుళ్లకూ మొక్కుతున్నారు రైతులు. ఇందులో భాగంగా కొందరు రాజధాని రైతులు షిరిడీ బయల్దేరి వెళ్లారు. అమరావతిలోనే రాజధాని కొనసాగేలా షిరిడీ సాయినాథుణ్ణి వేడుకుంటామన్నారు.

Tags

Read MoreRead Less
Next Story