నేడు సీఎం కేసీఆర్‌ కాళేశ్వరం పర్యటన

నేడు సీఎం కేసీఆర్‌ కాళేశ్వరం పర్యటన

కాళేశ్వరం ప్రాజెక్టును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది తెలంగాణ ప్రభుత్వం. అందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా పనులను పరిశీలిస్తున్నారు. రాత్రి బసచేసిన తీగలగుట్టపల్లి నుంచి ఉదయం హెలికాప్టర్‌ ద్వారా కాళేశ్వరం వెళ్లి ముక్తేశ్వరస్వామిని దర్శించుకుంటారు. అనంతరం మేడిగడ్డపై నిర్మించిన లక్ష్మీ ఆనకట్టను పరిశీలించనున్నారు. ఆనకట్టలో నదీ జలాల నిల్వ తీరు, ఆనకట్టకు సంబంధించిన విషయాలు, ఇతరత్రా అంశాలపై అక్కడే ఇంజినీర్లు, అధికారులతో సమీక్షించనున్నారు. అనంతరం గోదావరి నదితో పాటు పరసర ప్రాంతాలను ఏరియల్ సర్వే ద్వారా పరిశీలిస్తారు. లక్ష్మీ ఆనకట్టతో పాటు సరస్వతి, పార్వతి ఆనకట్టల నుంచి ఎల్లంపల్లి వరకు ఉన్న నీటి నిల్వలకు సంబంధించి పూర్తి స్థాయిలో అధికారులతో కేసీఆర్‌ సమీక్షించనున్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టుల సందర్శన నేపథ్యంలో బుధవారం ప్రగతిభవన్‌లో అధికారులతో రివ్యూ చేశారు సీఎం కేసీఆర్‌. కాళేశ్వరం ప్రాజెక్టులలోకి అనుకున్న రీతిలో సాగునీరు చేరుకుంటున్నదని, బ్యారేజీలు నిండుకుండలా మారాయన్నారు. వచ్చే వర్షం కాలం నుంచి వరద ప్రవాహం పెరుగుతుందన్నారు. ప్రాణహిత ద్వారా లక్ష్మీ బ్యారేజీకి చేరుకునే వరద నీటిని ఎప్పటికప్పుడు ఎగువకు ఎత్తిపోసి..అటునుంచి కాలువలకు మళ్లించే దిశగా.. ఇరిగేషన్ శాఖ అప్రమత్తం కావాలన్నారు. దీనికి సంబంధించి ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులకు సూచించారు..

గోదావరిపై నిర్మిస్తున్న తుపాకుల గూడెం బ్యారేజీకి ‘సమ్మక్క పేరు పెట్టాలని నిర్ణయించారు సీఎం కేసీఆర్‌. ఈ మేరకు జీవోను జారీ చేయాలని ఇంజనీరింగ్‌ చీఫ్‌ మురళీధర్ రావును ఆదేశించారు. ముక్కోటి దేవతల కరుణాకటాక్షాలు బలంగా వుండటం వల్లే తెలంగాణ అభివృద్ది అనుకున్న రీతిలో సాగుతుందని తెలిపారు. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం పూర్తయి తెలంగాణ బీళ్లకు కాళేశ్వరం సాగునీళ్లు చేరుకుంటున్నాయని, పలు బ్యారేజీలకు, రిజర్వాయర్లకు దేవతామూర్తుల పేర్లను పెట్టుకుందామన్నారు సీఎం కేసీఆర్.

Tags

Read MoreRead Less
Next Story