14 Feb 2020 7:28 AM GMT

Home
 / 
అంతర్జాతీయం / చైనాలో కరోనా బాధితులు...

చైనాలో కరోనా బాధితులు 60 వేలు

చైనాలో కరోనా బాధితులు 60 వేలు
X

కరోనా వైరస్‌ చైనాలో కల్లోలం రేపుతోంది. కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 14 వందలకు చేరింది. రోజుకు వంద మందికిపైగా ఈ వైరస్‌ బారిన పడి చనిపోతుండడంతో చైనాలో కలవరం మొదలైంది. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ఎన్ని ప్రయత్నాలు చేపట్టినా.. ఫలితాలు ఇవ్వడం లేదు. రోజు రోజుకు కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు చైనాలో 60 వేల మంది కరోనా వైరస్‌ బారిన పడ్డారు. దీంతో హెల్త్‌ ఎమర్జెన్సీ ప్రకటించిన చైనా.. అనుమానితులను ప్రత్యేక ఆస్పత్రుల్లో చేర్పించి చికిత్సలు అందిస్తోంది. భారత్ పాటు మరో 24 దేశాలకు కరోనా వైరస్ విస్తరించింది. కరోనా వైరస్ కారణంగా చైనాలో భయానక పరిస్థితులు నెలకొన్నాయి. ప్రజలు ఇళ్లల్లో బందీలుగా మారారు. గడపదాటి బయటకు వచ్చే సాహసం చేయడం లేదు.

చైనాలో నిన్న ఒక్కరోజే 15వేలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. చైనాలో పర్యటించని వారికి కూడా కరోనా వైరస్ సోకడాన్ని బట్టి ఇది ఎంత వేగంగా వ్యాప్తి చెందుతుందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే 25 దేశాలకు విస్తరించిన కరోనా వైరస్... ప్రపంచ దేశాలను వణికిస్తోంది. కరోనా వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోతున్నవారి సంఖ్య అంతకంతకూ పెరగడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ అప్రమత్తమయ్యింది. చైనాలో పరిస్థితిని అంచనా వేసేందుకు ఓ బృందాన్ని పంపింది. ఎండలు పెరిగితే వైరస్ కాస్త కంట్రోల్‌లోకి వస్తుందని కొందరు అంచనా వేస్తుండగా.. ప్రపంచ ఆరోగ్య సంస్థ మాత్రం దానిపై ఇప్పుడే స్పష్టత ఇవ్వలేమంటోంది.

చైనాలోని ఆస్పత్రులకు రోగుల తాకిడి రోజురోజుకీ పెరగడంతో వైద్య సిబ్బందిపై ఒత్తిడి పెరుగుతోంది. నిత్యం జన సంచారంతో నిండిపోయి కిటకిటలాడే చైనాలోని పలు నగరాల వీధులన్నీ.. కరోనా దెబ్బకు బోసిపోయాయి. ఎడారిని తలపించేలా మారాయి. వుహన్‌ నగరంలో మాత్రం స్మశాన నిశ్శబ్దం తాండవిస్తోంది. జనం బయటకు వచ్చేందుకే భయపడటంతో రోడ్లన్నీ ఖాళీ అయిపోయాయి. అనేక పరిశ్రమలు మూసివేయడంతో ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న చైనా.. తీవ్ర ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొంటోంది. ఇప్పటికే కరోనా వైరస్ కారణంగా పలు రంగాల్లో కార్యకలాపాలు స్థంభించిపోయాయి. అత్యంత త్వరగా ఒకరి నుంచి మరొకరికి వ్యాపించే అవకాశం ఉండడంతో చైనాలో విద్యాసంస్థలతో పాటు ఆఫీసులు సెలవులు ప్రకటించాయి. పరిశ్రమలతో పాటు పర్యాటక రంగంపై కూడా ఇది తీవ్ర ప్రభావం చూపుతోంది.

భారత్‌లోనూ పలు కరోనా అనుమానిత కేసులు నమోదయ్యాయి. కేరళలో మూడు కరోనా కేసులు నమోదు కావడంతో వారిని ప్రత్యేక వార్డుల్లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. మరోవైపు హైదరాబాద్‌ రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఏర్పాటు చేసిన కరోనా థర్మల్‌ స్కానింగ్‌ ద్వారా స్క్రీనింగ్‌ ప్రక్రియ కొనసాగుతోంది. గత నెల 30 నుంచి ఇప్పటి వరకు వివిధ దేశాల నుంచి వచ్చిన వారిలో 8 వేల 212 మందికి థర్మల్‌ స్క్రీనింగ్‌ నిర్వహించారు. కరోనా లక్షణాలుంటే ప్రాథమికంగా థర్మల్‌ స్కానింగ్‌లో గుర్తించడానికి వీలుంది. ప్రధానంగా జ్వరం ఉష్ణోగ్రతలు థర్మల్‌ స్కానింగ్‌లో గుర్తిస్తారు. జలుబు, దగ్గు వంటి లక్షణాలుంటే నేరుగా నిర్ధారిస్తున్నారు.

Next Story