ఒకే గొడుగు కిందకు అన్ని ఇంజినీరింగ్ విభాగాలు: సీఎం కేసీఆర్‌

ఒకే గొడుగు కిందకు అన్ని ఇంజినీరింగ్ విభాగాలు: సీఎం కేసీఆర్‌

మేడిగడ్డ వద్ద లక్ష్మి జలాశయంలో నీటిమట్టం గరిష్ఠ స్థాయికి చేరుకున్న వేళ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించారు. కరీంనగర్ నుంచి హెలికాప్టర్‌లో కాళేశ్వరం చేరుకున్న కేసీఆర్... ముక్తీశ్వరస్వామి ఆలయానికి వెళ్లారు . వేదపండితులు ముఖ్యమంత్రికి పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. ముక్కే శ్వర స్వామిని దర్శించుకున్న కేసీఆర్, అభిషేక నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు కేసీఆర్‌ను ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందచేశారు.

అనంతరం మేడిగడ్డ జలాశయం, కన్నేపల్లి పంప్‌హౌస్‌లను ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించారు. అనంతరం కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగమైన లక్ష్మీ బరాజ్‌ను సందర్శించారు. ప్రాణహిత వద్ద నదీ జలాలను పరిశీలించారు. నీటి నిర్వహణపై అధికారులు, ఇంజినీర్లతో సమీక్షించారు. అనంతరం గోదావరి పుష్కరఘాట్‌కు చేరుకుని త్రివేణి సంగమం వద్ద పూజలు చేశారు. ప్రాణహిత - గోదావరి నదుల పవిత్ర జలాలను తలమీద చల్లుకున్నారు. నదిలో నాణేలు వదిలి చీర సారె సమర్పించారు.

అనంతరం... కరీంనగర్‌ చేరుకున్న కేసీఆర్‌... కాళేశ్వరం ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహించారు. ప్రాజెక్టుల నిర్వహణ, నీటి సరఫరాపై అధికారులకు సీఎం దిశా నిర్దేశం చేశారు. వర్షాకాలంలో ప్రాజెక్టులోకి వరద నీరు ఉద్ధృతంగా వస్తుందని, ఇది దృష్టిల పెట్టుకొని లక్ష్మీ బ్యారేజ్ నుంచి ఎప్పటికప్పుడు నీటిని తోడుకోవాలని కేసీఆర్ సూచించారు. గోదావరి జలాలు వృథాగా పోకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఇంజినీర్‌లదేనన్నారు. ఎస్‌ఆర్‌ఎస్పీ నుంచి కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజీల వరకు చివరాఖరి ఆయకట్టు వరకు పంటలకు సాగునీరు ఇవ్వాలని సూ చించారు. ఇంజినీరింగ్ వ్యవస్థను పటిష్టం చేసుకొని ఎక్కడికక్కడ పని విభజన చేసుకోవాలని నిర్దేశించారు.

సాగునీటి ఇంజినీరింగ్ విభాగంలో కీలక మార్పులకు కేసీఆర్ శ్రీకారం చుట్టారు. సాగునీటికి సంబంధించిన అన్ని ఇంజినీరింగ్ విభాగాలను ఒకే గొడుకు కిందికి తీసుకురావాలని నిర్ణయించారు. సాగునీటి ఇంజినీరింగ్ వ్యవస్థను 11 సర్కిళ్లుగా విభజించాలని సూచించారు. సర్కిల్ అధిపతిగా చీఫ్ ఇంజినీర్‌ను నియమించాలని ఆదేశించారు. జూన్ నెలాఖరులోగా ఇరిగేషన్ ఇంజినీరింగ్ విభాగంలో అన్ని ఖాళీలను భర్తీ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. కరీంనగర్‌, నిజామాబాద్ జిల్లా కేంద్రాలలో కొత్త కలెక్టరేట్లను మంజూరు చేశారు.

Tags

Next Story