జై అమరావతి నినాదంతో మార్మోగుతున్న రాజధాని గ్రామాలు

అమరావతి సాధించుకునే వరకు తమ ఉద్యమం ఆగదని రైతులు తెగేసి చెప్పారు. మూడు రాజధానులపై ప్రభుత్వం వెనక్కి తగ్గేవరకు ఆందోళన విరమించబోమని స్పష్టం చేశారు. వియ్ వాంట్ జస్టిస్ అంటూ నినదించారు. 58వ రోజు కూడా సడలని పట్టుదలతో ఆందోళనలు చేపట్టారు. ధర్నాలు, నిరసనలతో రాజధాని గ్రామాలు మారుమోగాయి. మందడం, వెలగపూడి, తుళ్లూరు, కృష్ణాయపాలెం.. ఇలా ఆ ఊరు.. ఈ ఊరు అని తేడాలేకుండా 29 రాజధాని గ్రామాల్లో ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడింది.
రైతులు, మహిళలు, వృద్ధులు, యువకులు.. పెద్దయెత్తున ఆందోళన, నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇన్ని రోజులుగా ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వంలో ఒక్కరికి కూడా తమ బాధ కనిపించడం లేదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించే వరకు ఇలాగే శాంతియుతంగా ఆందోళనలు కొనసాగుతాయిని స్పష్టం చేశారు.
58 రోజులుగా రైతులు అలుపన్నది లేకుండా పోరుబాటలో ఉన్నారు రైతులు. వేడుకైనా.. వేదనైనా.. అమరావతే తమ పరమావధి అంటున్నారు. బుధవారం వివాహ వేడుకలో జై అమరావతి నినాదం మార్మోగగా.. గురువారం తుళ్ళూరులో ఓ ఇంటి శంకుస్థాపన కార్యక్రమంలో కూడా ఉద్యమ హోరు కన్పించింది. ప్లకార్డులు చేతపట్టుకుని జై అమరావతి అంటూ రైతులు, మహిళలు నినదించారు. అమరావతి ప్లకార్డులు చేతపట్టుకునే దంపతులు ఇంటికి శంకుస్థాపన చేశారు. మూడు రాజధానులు వద్దు.. అమరావతే ముద్దని నినదించారు.
అమరావతి ఉద్యమంలో భాగంగా.. మందడంలో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. కృష్ణాయపాలెం శిబిరంపై దుండగుడు మందు సీసా విసరడంతో కలకలం రేగింది. ఆర్టీసీ బస్సులో నుంచి సదరు దుండగుడు మందు సీసా విసరడంతో... మందడంలో బస్సును ఆపి ఆందోళనకు దిగారు. బాటిల్ విసిరిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.ఇవాళ బాటిల్ విసిరారు.. రేపు బాంబులో, అగ్గిపుల్లో విసిరితే తమ పరిస్థితి ఏంటని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ ఉద్యమాన్ని అణిచివేసేందుకు కావాలనే కొందరు వ్యక్తులతో ఇలాంటివి చేయిస్తున్నారని మండిపడుతున్నారు. మందడం, కృష్ణాయపాలెం రైతులు ఆందోళనకు దిగడంతో మందడంలో ట్రాఫిక్ స్తంభించిపోయింది. నిందితుడిని కఠినంగా శిక్షిస్తామని పోలీసులు హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళనను విరమించారు.
ఇదిలావుంటే, దీక్షాశిబిరం పై బాటిల్ విసిరిన యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే, తాను కావాలని ఆపని చేయలేదని నిందితుడు చెప్పాడు. అది సీసా కూడా కాదని.. ప్లాస్టిక్ బాటిల్ అని అన్నాడు. వివాదం ఇంత సీరియస్ అవుతుందని అనుకోలేదన్నాడు.
మరోవైపు, అమరావతి ఉద్యమానికి అంతకంతకూ మద్దతు పెరుగుతోంది. 13 జిల్లాల నుంచే కాకుండా.. ఇతర ప్రాంతాల నుంచి కూడా వచ్చి అమరావతి రైతుల దీక్షలకు సంఘీభావం తెలుపుతున్నారు. అమరావతి ఉద్యమానికి ఓయూ విద్యార్ధులు మద్దతు ప్రకటించారు. మందడం వచ్చి రైతుల దీక్షకు సంఘీభావం తెలిపారు. మూడు రాజధానుల నిర్ణయాన్ని సీఎం జగన్ వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. శుక్రవారం నుంచి ఏపీ విద్యార్ధి సంఘాలతో కలిసి బస్సు యాత్ర చేస్తామన్నారు. ఈ యాత్రలో అమరావతి ఆవశ్యకతను ప్రజలకు తెలిజేస్తామంటున్నారు.
ఓవైపు సీఎం జగన్ మొండిపట్టుదలతో ముందుకెళ్తుంటే.. మరోవైపు రాజధాని రైతులు సైతం అదే పట్టుదలతో ఉద్యమం కొనసాగిస్తున్నారు. మూడు రాజధానుల ప్రతిపాదనపై సీఎం జగన్ తన నిర్ణయాన్ని మార్చుకునే వరకు.. పోరాటం చేస్తూనే ఉంటామన్నారు రైతులు.
RELATED STORIES
Telugu Movies OTT : అప్పుడు మాత్రమే ఓటీటీల్లోకి రిలీజ్ చేయాలి :...
19 Aug 2022 11:00 AM GMTAnasuya Bharadwaj : అనసూయపై విరుచుకుపడ్డ నెటిజన్లు..
19 Aug 2022 9:45 AM GMTVijay Devarakonda: విజయ్ దేవరకొండపై ట్రోల్స్.. వివాదం వెనుక నిజం
19 Aug 2022 9:02 AM GMTSamantha: డియర్ సామ్.. ఎక్కడికి వెళ్లారు, ఏమైపోయారు.. నెటిజన్స్...
19 Aug 2022 6:49 AM GMTThiru Movie Review: 'తిరు' మూవీ రివ్యూ.. ఆ సినిమాను తలపించే కథ..
18 Aug 2022 1:00 PM GMTSSMB 28 Release Date: మహేశ్, త్రివిక్రమ్ మూవీ రిలీజ్ డేట్
18 Aug 2022 12:30 PM GMT