నేడు సాయంత్రం హోంమంత్రి అమిత్ షాతో.. సీఎం జగన్ భేటీ..
ఏపీ సీఎం జగన్ ఇవాళ ఢిల్లీకి వెళ్లనున్నారు. సాయంత్రం హోంమంత్రి అమిత్ షా అపాయింట్ మెంట్ ఖరారైంది. ఒక్క రోజు గ్యాప్‌తో రెండోసారి హస్తినకు పయణమవ్వడం ఆసక్తిని రేపుతోంది...బుధవారం సాయంత్రం ఢిల్లీ వెళ్లి ప్రధాని నరేంద్రమోదీతో సమావేశమైన సీఎం ...అనేక అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. గంటన్నరపాటు సాగిన భేటీలో రాష్ట్రానికి సంబంధించిన అంశాలతో పాటు పలు రాజకీయ అంశాలపైనా ప్రధాని మోదీకి వివరణ ఇచ్చారు. ఢిల్లీలోనే ఉండి గురువారం హోంమంత్రి అమిత్ షాను కూడా కలుస్తారని ప్రచారం జరిగింది. అయితే అపాయింట్ మెంట్ ఖరారు కాకపోవడంతో విజయవాడ వచ్చారు. మళ్లీ శుక్రవారం అమిత్ షా అపాయింట్‌మెంట్ ఇవ్వడంతో... ఢిల్లీ వెళ్లి ఆయనతో చర్చలు జరపనున్నారు ఏపీ సీఎం జగన్.
అమిత్ షాతో జగన్ భేటీకి అత్యంత ప్రాధాన్యత ఉందని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. మండలి రద్దు, కర్నూలుకు హైకోర్టు తరలింపు వంటి అంశాల్లో ముందుగా నిర్ణయం తీసుకోవాల్సింది హోంశాఖే. మండలి రద్దుకు దారి తీసిన పరిణామాలతో పాటు కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని తీసుకున్న నిర్ణయంపై అమిత్ షాకు సీఎం సమగ్ర వివరణ ఇచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మొత్తానికి ప్రధాని మోదీతో సమావేశం తరువాత మరోసారి సీఎం జగన్ ఢిల్లీ బాట పడుతున్నారు. అయితే 3 రాజధానులు, మండలి రద్దు సహా పలు నిర్ణయాలపై కేంద్రం ఎలా స్పందిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com