డబ్బులు తీసుకొని ఓటేస్తే.. పరిస్థితి ఇలాగే ఉంటుంది: పవన్
ఎన్నికల సమయంలో ప్రలోభాలకు లోనై ఓట్లేస్తే పరిస్థితి ఇలాగే వుంటుందని అన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. వైసీపీ ప్రభుత్వంపై పదునైన విమర్శలు చేశారు. రెండోరోజు కర్నూలు జిల్లాలో పర్యటనలో భాగంగా.. జోహరాపురం వంతెన సమస్యపై స్థానికులతో మాట్లాడారు పవన్. ప్రజాప్రతినిధుల మధ్య గొడవ కారణంగా వంతెన నిర్మాణ పనులు ఆగిపోవడం దారుణమని అన్నారు.
జోహరాపురం వంతెనను పరిశీలించిన పవన్.. ప్రజలకు ఇబ్బందులు కలిగించేవారిపై తిరగబడాలన్నారు. వర్షం కురిసిప్పుడల్లా హంద్రీనదిపై మట్టి వంతెన తెగిపోతోందని, ఈ బ్రిడ్జ్‌ను ప్రభుత్వం పూర్తిచేయలేకపోతుందన్నారు. పేదలకు ఇళ్లు ఇవ్వకుండా ప్రభుత్వం సొంత అజెండాతో ముందుకెళ్తోందని విమర్శించారు పవన్.
ఈ సందర్భంగా పలు పవన్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చిన్నపాటి వంతెన కూడా నిర్మించలేని ప్రజాప్రతినిధులు ఎన్నికల్లో గెలిచి ఏం లాభమని ప్రశ్నించారు. అందుకే, ప్రజాప్రతినిధులను ఎన్నుకునే ముందు ప్రజలు ఆలోచించి ఓటేయాలని సూచించారు. ప్రజలు సమస్యల్ని తమ దృష్టికి తీసుకొస్తారే గానీ.. ఎన్నికల సమయంలో బాధ్యతగా వుండేవారిని ఎన్నుకోవడం లేదని అసహనం వ్యక్తం చేశారు. డబ్బులు తీసుకుని ఓట్లేస్తే పరిస్థితి ఇలాగే వుంటుందని అన్నారు.
ఆ తర్వాత ఎమ్మిగనూరులో పర్యటించిన పవన్ కళ్యాణ్.. చేనేత కార్మికులతో సమావేశమయ్యారు.. వారి కష్టసుఖాలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వాలు మారుతున్నా తమ రాత మాత్రం మారడం లేదని ఈ సందర్భంగా చేనేత కార్మికులు పవన్ కల్యాణ్ ముందు వాపోయారు.. తాము పడే కష్టానికి ఫలితం దక్కడం లేదన్నారు.. చేనేత క్లస్టర్ ఏర్పాటయ్యేలా చొరవ తీసుకోవాలని చేనేత కార్మికులు పవన్ కల్యాణ్‌కు విజ్ఞప్తి చేశారు.
చేనేత కార్మికుల సమస్యలన్నీ విన్న పవన్.. న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు.. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను వైసీపీ ప్రభుత్వం అమలు చేయాలని జనసేనాని డిమాండ్ చేశారు.. రెండు వారాల్లో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి సమస్యలు గుర్తించి కేంద్రం దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు.
బీజేపీతో జనసేన కలిసి పనిచేస్తోంది కాబట్టి.. కేంద్రం ద్వారా సమస్యలకు పరిష్కారాలు రాబట్టుకుందామన్నారు పవన్ కళ్యాణ్. నేతన్నల సమస్యలపై కేంద్రం దిగివచ్చేలా కలిసి పోరాడదామని పిలుపునిచ్చారు. ఎల్లవేళలా చేనేత కార్మికులకు అండగా వుంటానని హామీ ఇచ్చారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com