వైసీపీ విమర్శలకు టీడీపీ నేతల స్ట్రాంగ్‌ కౌంటర్లు

వైసీపీ విమర్శలకు టీడీపీ నేతల స్ట్రాంగ్‌ కౌంటర్లు

ఏపీలో ఐటీ మంటలు రాజకీయ సెగలు పుట్టిస్తున్నాయి. ఐటీ దాడులతో టీడీపీ బండారం బయటపడిందని వైసీపీ ఆరోపిస్తుంటే.. పచ్చకామర్లె వాళ్లకు లోకమంతా అలానే కనిపిస్తుందని టీడీపీ కౌంటర్‌ ఇస్తోంది.

చంద్రబాబు, లోకేష్‌ల బినామీ ఆస్తులపై ఐటీ దాడులు జరిగాయని బొత్స ఆరోపించారు. ఈ సోదాలతో చంద్రబాబు అవినీతి బయటపడిందన్నారు. ఇంతా జరుగుతుంటే చంద్రబాబు, లోకేష్ ఎందుకు నోరెత్తడం లేదని బొత్స ప్రశ్నించారు.

పచ్చ కామెర్ల వాడికి లోకమంతా పచ్చగా కనిపించినట్లు.. జగన్‌కు లోకమంతా అవినీతిగా కనపడటంలో పెద్ద ఆశ్చర్యం ఏమి లేదన్నారు మాజీ మంత్రి లోకేష్‌. ఐటీ దాడుల విషయంలో వైసీపీ చేస్తున్న ఆరోపణలకు ట్విట్టర్‌ ద్వారా కౌంటర్‌ ఇచ్చారు. కొండను తవ్వి ఎలుకను పట్టినట్టు.. వారు ఇచ్చిన పత్రికా ప్రకటన ద్వారానే అర్థమైందని మండిపడ్డారు.

ఐటీ దాడుల సాకుతో టీడీపీపై దుష్ప్రచారం చేస్తున్నారని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ఫైర్‌ అయ్యారు. PAలు, PSలకు పార్టీతో ఏం సంబంధం ఉంటుందని సూటిగా ప్రశ్నించారు. చంద్రబాబు మాజీ పీఎస్‌ శ్రీనివాస్‌కు, టీడీపీతో ఏం సంబంధం ఉంటుందని నిలదీశారాయన. ఆస్తుల కేసు నుంచి తాను తప్పించుకోవడం.. ఎదుటి వాళ్లపై దాడులు చేయడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి జగన్‌ మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్నారని యనమల విమర్శించారు.

ఎక్కడో ఐటీ దాడులు జరిగితే వాటిని టీడీపీకి ఆపాదిస్తున్నారని ఆ పార్టీ సీనియర్‌ నేత దేవినేని ఉమ మండిపడ్డారు. కేసీఆర్ సన్నిహితుల కంపెనీ ప్రతిమ ఇన్‌ఫ్రాలోనూ ఐటీ సోదాలు జరిగాయని మరి వైసీపీ మంత్రులు ఆ పేరు ఎందుకు ఎత్తడం లేదని ప్రశ్నించారు? కేసీఆర్ మీ తోకలు కత్తిరిస్తారని భయమా అంటూ నిలదీశారు.

జగన్‌లా అందరూ అవినీతిపరులే అని ముద్ర వేయడానికి వైసీపీ నేతలు కష్టపడుతున్నారంటూ అచ్చెన్నాయుడు ట్విట్టర్‌లో ఫైర్‌ అయ్యారు. చంద్రబాబు మాజీ పీఎస్‌ దగ్గర 2 వేల కోట్లు దొరికాయంటూ వైసీపీ కట్టుకథ అల్లిందన్నారు. గతంలో వైఎస్‌ కూడా చంద్రబాబుపై అవినీతి మరక అంటించాలని ప్రయత్నించి 26 ఎంక్వైయిరీ కమిటీలు వేసి కోర్టు చివాట్లు పెట్టే పరిస్థితికి తెచ్చుకున్నారన్నారు. ఇప్పుడు వైసీపీ ఉస్కోబ్యాచ్‌ తయారైందంటూ ట్విట్టర్‌లో ఘాటుగా విమర్శించారు.

దేశవ్యాప్తంగా ఐటీ తనిఖీలు జరిగితే టీడీపీకి అంటగడుతున్నారంటూ మండిపడ్డారు బొండా ఉమ. ఐటీ తనిఖీలకు టీడీపీకి సంబంధం లేదన్నారాయన.

ఎక్కడో ఐటీ దాడులు జరిగితే టీడీపీకి ఏం సంబంధం అని ప్రశ్నించారు ఆ పార్టీ మహిళా నేత పంచమర్తి అనురాధ. ఐటీ అధికారుల ప్రకటనలో ఎక్కడా టీడీపీ నేతల పేర్లు ప్రస్తావనకు రాలేదని.. అయినా టీడీపీపై మరక అంటించేందుకు వైసీపీ ప్రయత్నిస్తోందని మండిపడ్డారు.

ప్రస్తుతం రాష్ట్రంలో ఐటీ దాడులపై మాటల తూటాలు పేలుతున్నాయి. ఇటు వైసీపీ మంత్రులు, నేతలు అంతా లైన్‌ కట్టి చంద్రబాబు, లోకేష్‌లే టార్గెట్‌గా విమర్శలు చేస్తున్నారు. అదే స్థాయిలో టీడీపీ నేతలు సైతం వైసీపీ విమర్శలకు స్ట్రాంగ్‌ కౌంటర్లు ఇస్తున్నారు.

Tags

Next Story