61వ రోజుకు చేరిన రాజధాని ఉద్యమం

రాజధాని ఉద్యమం 61వ రోజుకు చేరింది. ఉద్యమమే శ్వాసగా అమరావతి రైతులు, మహిళలు ముందుకు సాగుతున్నారు. దీక్షా శిబిరాలే వారికి నివాసాలుగా మారిపోయాయి. అనుకున్నది సాధించే వరకు ఉద్యమాన్ని ఆపమంటున్నారు. మందడం, తుళ్లూరు, వెలగపూడి, రాయపూడి, కృష్ణాయపాలెం, ఎర్రబాలెంలో రైతులు, మహిళలు 61వ రోజు కూడా దీక్షలు, ధర్నాలు కొనసాగిస్తున్నారు. ఒకే రాష్ట్రం-ఒకే రాజధాని... మూడు రాజధానులు వద్దు-అమరావతే ముద్దు అని నినదిస్తున్నారు.

రాజధానిలోని 29 గ్రామాల్లోనూ నిరసనలు ఉధృతంగా కొనసాగుతున్నాయి. చివరకు చిన్న పిల్లలు కూడా తమ భవిష్యత్‌ కోసం నిరసనల్లో కూర్చుంటున్నారు. అమరావతినే రాజధానిగా కొనసాగిస్తామని ప్రభుత్వం ప్రకటించాలని డిమాండ్‌ చేస్తున్నారు. రెండు నెలలుగా ఆందోళన చేస్తున్నా తమను పట్టించుకోని ప్రభుత్వంపై రైతులు నిప్పులు చెరుగుతున్నారు. అసలు రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా అని ప్రశ్నిస్తున్నారు. రాజధాని కోసం 34 వేల ఎకరాలు ఇచ్చిన రైతులను పట్టించుకోని ప్రభుత్వం అవసరమా అని నిలదీస్తున్నారు. రాజధాని కోసం భూములు ఇచ్చిన తమను రోడ్డున పడేశారని.. భవిష్యత్‌ను ప్రభుత్వం అంధకారం చేసిందని కొందరు మహిళలు కన్నీటి పర్యంతమవుతున్నారు.

రైతులకు పలు వర్గాల నుంచి మద్దతు లభిస్తోంది. దీక్షాశిబిరాలను సందర్శించి రైతులకు సంఘీభావం తెలుపుతున్నారు. రైతులకు తాము అండగా ఉంటామని భరోసా ఇస్తున్నారు. విపక్ష నేతలు, ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు ఇచ్చే మద్దతుతో ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్తున్నారు రైతులు. ఆత్మస్థైర్యం కోల్పోకుండా పోరాట పటిమను చూపిస్తున్నారు.

Tags

Next Story