కోవిడ్-19ను నిరోధించడానికి చైనా చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు

కోవిడ్-19ను నిరోధించడానికి చైనా చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. ఈ మహమ్మారి బారినపడి ప్రాణాలు కోల్పోయినవారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. 16 వందల మందికిపైగా మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. నిన్న ఒక్కరోజే 143 మంది మృతిచెందగా, మరో 2వేల 641 కొత్త కేసులు నమోదైనట్టు చైనా ఆరోగ్య కమిషన్ వెల్లడించింది. మొత్తం 66వేల మందికిపైగా బాధితుల ఉన్నట్టు తేలింది.

20 రోజుల నుంచి హుబే ప్రావిన్సుల్లోని పలు నగరాల్లో ప్రజా రవాణా పూర్తిగా నిలిపివేశారు. చైనా వ్యాప్తంగా పాఠశాలలకు సెలవులు ప్రకటించగా, పలు సంస్థలు తమ ఉద్యోగులకు ఇంటి నుంచి పనిచేసుకునేలా వెసులుబాటు కల్పించాయి. అతి కొద్ది శాతం మంది మాత్రమే ఇళ్ల నుంచి బయటకు వస్తున్నారు. వైరస్‌ కేసులను గుర్తించడానికి అధికారులు ప్రమాణాలను మార్చడంతో ఈ వారంలో బాధితుల సంఖ్య బాగా పెరిగింది.

కోవిడ్‌ వైరస్‌ 17వందల 61 మంది వైద్యులు, నర్సులకు సోకిందని.. వీరిలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారని చైనా అధికారులు ప్రకటించారు. వైరస్ బారినపడ్డ వైద్య సిబ్బంది అధికంగా వుహాన్‌ నగరంలోనే ఉన్నారు. వైరస్ విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకుని బాధితులకు చికిత్స అందజేస్తున్నా.. మహమ్మారి నుంచి కొందరు తప్పించుకోలేకపోతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story