ముగిసిన సీఎం జగన్ ఢిల్లీ పర్యటన
ఏపీ సీఎం జగన్ ఢిల్లీ పర్యటన ముగిసింది. కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ తో సమావేశమయ్యారు. ఈ భేటీలో ప్రధానంగా శాసనమండలి రద్దు, కర్నూలుకు హైకోర్టు తరలింపుతో పాటూ దిశ చట్టంపై చర్చించినట్లు తెలుస్తోంది. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లోనే మండలి బిల్లుకు ఆమోదం తెలపాలని.. హైకోర్టును కర్నూలు తరలించేందుకు వీలుగా సహకరించాలని కోరినట్లు సమాచారం. దిశ చట్టాన్ని కూడా ఆమోదించాలని విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది.
ఇప్పటికే సీఎం జగన్ ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌షాను కలిసి రాష్ట్రానికి సంబంధించిన అంశాలతో పాటూ పలు కీలక విషయాలపై చర్చించారు. పోలవరం, రాజధానికి, వెనుకబడిన జిల్లాలకు నిధులు.. ప్రత్యేక హోదా, మూడు రాజధానులు, శాసనమండలి రద్దుపై ప్రధానంగా భేటీలో ప్రస్తావనకు వచ్చాయి. అలాగే దిశ చట్టం, విభజన సమస్యలు, పెండింగ్ నిధులపైనా చర్చించారు.
వాస్తవానికి సీఎం జగన్ శనివారం ఉదయమే హస్తిన నుంచి ఏపీకి రావాల్సి ఉంది. అయితే కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ అపాయింట్ మెంట్ దొరకడంతో చివరి నిమిషంలో షెడ్యూల్ మారింది. దీంతో రవిశంకర్ ప్రసాద్‌తో సమావేశమై.. పలు అంశాలపై చర్చలు జరిపారు సీఎం జగన్. ఈ భేటీ అనంతరం.. ఏపీకి చేరుకున్నారు సీఎం జగన్.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com