కరోనా కల్లోలం.. బీజింగ్‌లో ఆంక్షలు కఠినతరం

కరోనా కల్లోలం.. బీజింగ్‌లో ఆంక్షలు కఠినతరం

చైనాలో కరోనా కల్లోలం తగ్గడం లేదు. పైపెచ్చు రోజురోజుకూ మరణాల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. తాజాగా మృతుల సంఖ్య 16 వందలు దాటేసింది. వైరస్ బాధిత కేసులు 70 వేలకు చేరుకున్నాయి. ఇందులో 11 వేల మంది పరిస్థితి క్రిటికల్‌గా ఉన్నట్లు సమాచారం. చైనాలో శుక్రవారం ఒక్కరోజే 254 మంది మరణించారు. ఇందులో హూబే ప్రావిన్స్‌లో 139 మంది ప్రాణాలు కోల్పోయారు.

ఇక, చైనా రాజధాని బీజింగ్‌లో ఆంక్షలు కఠినతరం చేశారు. బయటి ప్రాంతాల నుంచి బీజింగ్‌కు వచ్చేవాళ్లు కచ్చితంగా 14 రోజుల పాటు ఇళ్లల్లోనే ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. ఒకవేళ ఎవరైనా ఇంటి నుంచి బయటకు వస్తే కఠిన శిక్షలు తప్పవని హెచ్చరించారు. బీజింగ్‌లో రెండు కోట్లకు పైగా జ‌నాభా ఉంది. ఇటీవలే చైనా కొత్త సంవత్సర సంబరాలు జరిగాయి. ప్రజలంతా తమ తమ ప్రాంతాల నుంచి మళ్లీ బీజింగ్‌కు చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది.

హూబే, వూహాన్‌లో పరిస్థితి నానాటికి దిగజారుతోంది. వైరస్ బాధితుల సంఖ్య అనూహ్యంగా పెరగడంతో హాస్టళ్లు, జిమ్‌లను కూడా హాస్పిటళ్లుగా మార్చేశారు. ఇప్పటికే లక్షలాదిమంది ఇళ్లల్లో బందీలుగా మారిపోయారు. వారి పరిస్థితి వర్ణనాతీతం. ఇరుగుపొరుగు వాళ్లతో మాట్లాడే వెసులుబాటు కూడా లేకపోవడంతో ప్రజలకు పిచ్చెక్కినట్లు అవుతోంది. ఆ ఫ్రస్టేషన్‌లో చాలామంది ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. తమ స్వేచ్ఛను హరించివేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

కరోనాను కట్టడి చేయడానికి అత్యాధునిక బిగ్ డేటా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్లౌడ్ కంప్యూటింగ్‌ తదితర సాంకేతిక సేవలను వినియోగించుకోవాలని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ పిలుపునిచ్చారు. వూహాన్ సహా దేశవ్యాప్తంగా ఆస్పత్రుల్లో లేటెస్ట్ టెక్నాలజీతో చికిత్స అందించాలని ఆదేశించారు. బాధితులకు అవసరమైన సదుపాయాలు కల్పించడానికి రోబోలోను రంగంలోకి దించారు. డ్రోన్ల సాయం తో ప్రజలకు సమాచారం పంపుతున్నారు. ఆహారాన్ని అందించడానికి కూడా క్యూఆర్ కోడ్‌లను వాడుతున్నారు.

ఇదిలా ఉంటే, జపాన్‌కు చెందిన డైమండ్‌ ప్రిన్సెస్ నౌకలోని భారతీయులను బయటకు తీసుకురావడానికి ప్రయత్నాలు మొదలయ్యాయి. వైద్య పర్యవేక్షణ ముగిసిన వెంటనే వారందరినీ భారత్‌కు తరలించడానికి ఏర్పాటు చేపట్టారు. భారత రాయబార కార్యాలయ అధికారులు ఎప్పటికప్పుడు జపాన్ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఇప్పటి వరకు ముగ్గురు భారతీయులు సహా నౌకలో 218 మందికి వైరస్ సోకినట్లు గుర్తించారు. దాంతో ప్రయాణికులు, సిబ్బంది మొత్తాన్ని వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు.

Tags

Read MoreRead Less
Next Story