వివాహ వేడుకల్లోనూ జై అమరావతి నినాదమే
రాజధాని కోసం అమరావతి రైతులు చేస్తున్న ఉద్యమం ఉధృతమవుతోంది. 60 రోజులుగా అలుపెరుగని పోరాటం చేస్తున్నారు. నిత్యం ఏదో ఒక కార్యక్రమంతో ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు.
రాజధాని గ్రామాల్లోని వేదిక ఏదైనా అక్కడ జై అమరావతి నినాదమే మార్మోగుతోంది. మందడం, తుళ్లూరులో మహాధర్నా, వెలగపూడిలో రిలేదీక్షలు కొనసాగుతున్నాయి. యర్రబాలెం, కృష్ణాయపాలెం, రాయపూడి, అనంతవరం సహా 29 గ్రామాల్లోనూ ఉద్యమ సెగలు ప్రజ్వరిల్లుతున్నాయి..
తాడికొండ క్రాస్ రోడ్డు నుంచి అనంతవరం వెంకటేశ్వరస్వామి గుడి వరకు భారీ ర్యాలీ నిర్వహించారు రాజధాని రైతులు. 50కిపైగా ట్రాక్టర్లు, పెద్ద సంఖ్యలో బైక్‌లతో తరలివచ్చారు...జగన్ మనసు మార్చాలంటూ వెంకటేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు చేశారు. అమరావతి కోసం ప్రాణాలైనా అర్పిస్తామంటూ నినదించారు..
రాజధాని కోసం భూములు ఇవ్వడమే తాము చేసిన నేరమా అని నిలదీస్తున్నారు రైతులు. 5 కోట్ల ఆంధ్రుల భవిష్యత్ కోసం చేసిన త్యాగాన్ని వైసీపీ ప్రభుత్వం అపహాస్యం చేస్తోందని మండిపడ్డారు. తమ ఉద్యమాన్ని ఏ మాత్రం పట్టించుకోకుండా ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోందని... అయితే అమరావతి కోసం తాము అంతకంటే పట్టుదలతో పోరాటం చేస్తామని స్పష్టం చేశారు..
అటు షిర్డీ సాయిబాబా సన్నిధిలోనూ అమరావతి నినాదాలు మార్మోగుతున్నాయి. జగన్ మనసు మారాలని షిర్డీలోనూ తెలుగు వాళ్లు ర్యాలీ తీశారు. ఒక రాజధాని ముద్దు..మూడు రాజధానులు వద్దు అని నినదించారు.
వివాహ వేడుకల్లోనూ జై అమరావతి నినాదమే వినిపిస్తోంది. పెదపరిమి గ్రామంలో అడుసుమల్లి నరేంద్రబాబు, రేణుకదేవి తమ కుమారుడి వివాహ ఆహ్వాన పత్రికను వినూత్నంగా ప్రచురించారు. పెళ్లి కొడుకు శ్రీహర్ష, పెళ్లి కూతురు మాలతి పేర్లతో పాటు ‘సేవ్ అమరావతి ఫార్మర్స్’ అనే నినాదాన్ని కూడా ముద్రించారు. పెళ్లి జరుగుతున్నప్పుడు కూడా ‘జై అమరావతి’, మూడు రాజధానులు వద్దు.. అమరావతి ముద్దు’ అనే ప్లకార్డులు చేతపట్టుకుని నినాదాలు చేశారు. వేదికపై ఉన్న వధూవరులు కూడా ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేయడం విశేషం. దీంతో పెళ్లి మండపం మొత్తం అమరావతి నినాదాలతో మార్మోగింది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com