సహకార సంఘాల ఎన్నికల్లో టీఆర్‌ఎస్ హవా

సహకార సంఘాల ఎన్నికల్లో టీఆర్‌ఎస్ హవా
X

సహకార సంఘాల ఎన్నికల్లోనూ టీఆర్‌ఎస్ హవా కొనసాగింది. 11 వేల డైరెక్టర్‌ పోస్టులను ఆ పార్టీ మద్దతుదారులు కైవసం చేసుకున్నారు. టీఆర్‌ఎస్‌ ఖాతాలో 900 సహకార సంఘాలు చేరనున్నాయి. ఎన్నికల సందర్భంగా పలు జిల్లాల్లో ఘర్షణలు జరగడంతో ఉద్రిక్తతలు తలెత్తాయి. ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, ఆదిలాబాద్‌ జిల్లాలో పలు చోట్ల ఘర్షణ వాతావరం కనిపించింది. సూర్యాపేట ఎన్నికల్లో ఇరు వర్గాల మధ్య ఏర్పడ్డ వివాదం ఓ వ్యక్తి ప్రాణాలు తీసింది. రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల అధికార టిఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ మధ్య తోపులాటలు కనిపించాయి. ఏడేళ్ల తరువాత ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఎన్నికలు జరగడంతో సాధారణ ఎన్నికలను తలపించాయి. భారీగా నగదు, మద్యం పంపిణీ జరిగింది. ఓటర్లు సైతం భారీగా క్యూలో నిలబడి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్‌ మధ్యాహ్నం 1 గంటకు ముగిసింది. అప్పటి వరకు క్యూలైన్లో ఉన్న వారికి ఓటు వేసేందుకు అవకాశం కల్పించారు.

రాష్ట్రంలో మొత్తం 905 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు ఉండగా, 904 సొసైటీలకు ఎన్నికల నోటిఫికేషన్లు జారీ అయ్యాయి. వీటిలో మొత్తం 11, 654 డైరెక్టర్ల ప్రాదేశిక నియోకవర్గాలు ఉన్నాయి. ఇప్పటికే 904 సొసైటీల్లో 157 సొసైటీలు ఏకగ్రీవమయ్యాయి. వీటిలోని డైరెక్టర్లతోపాటు ఇతర సొసైటీల్లో ఏకగ్రీవమైన డైరెక్టర్లను కలుపుకొని మొత్తం 5 వేల 406 డైరెక్టర్లు ఏకగీవ్రంగా ఎన్నికయ్యారు.

ఎన్నికలకు ప్రభుత్వం పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసింది. జిల్లా స్థాయిలో కలెక్టర్లు, ఎస్పీలు భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు.. మొత్తం 747 మంది గెజిటెడ్‌ ఆఫీసర్లు ఎన్నికల అధికారులుగా వ్యవహరించారు. మరో 20 వేల మందికి పైగా సిబ్బంది విధులు నిర్వహించారు...2 గంటల నుంచి కౌటింగ్‌ మొదలైంది. రాత్రి 7గంటల వరకు పూర్తి ఫలితాలు వెల్లడయ్యాయి. మూడు రోజుల తర్వాత పాలకవర్గాల నియామకం చేపట్టనున్నట్లు రాష్ట్ర సహకార ఎన్నికల అథారిటీ అధికారి సుమిత్ర వెల్లడించారు.

Tags

Next Story