ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెడితే అరెస్ట్‌.. వెబ్ జర్నలిస్టుల జాడ గల్లంతు

ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెడితే అరెస్ట్‌.. వెబ్ జర్నలిస్టుల జాడ గల్లంతు

కరోనా వైరస్‌ చైనాలో గగ్గోలు పుట్టిస్తోంది. జిన్‌పింగ్ సర్కారు తీరుతో ప్రజలు విసిగిపోతున్నారు. అధికారులు, పోలీసులు ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తుండడంతో జనంలో ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. వైరస్ సోకిందని అనుమానం వస్తే చాలు ప్రజలను నిర్బంధించేస్తున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడితే అరెస్టు చేస్తున్నారు. తమ ప్రాంతాల్లో వైరస్ బాధితుల పరిస్థితిని చెప్తే కూడా ప్రశ్నలతో చంపేస్తున్నారు. ముఖ్యంగా హూబే ప్రావిన్స్‌లో పరిస్థితి దారుణంగా ఉంది. అక్కడి దయనీయ స్థితిపై కొంతమంది ఎప్పటికప్పుడు కథనాలు అందించేవారు. వెబ్ జర్నలిస్టు లుగా మారి బాధిత కుటుంబాల ఆవేదన, ఆస్పత్రుల్లో పరిస్థితులపై సోషల్‌ మీడియాలో వీడియోలు పోస్ట్ చేసేవారు. ఐతే, కొన్ని రోజులుగా వారి జాడ కనిపించడం లేదు. ఫాంగ్ బిన్, షెన్ కిషీల వ్యక్తిగత ఛానెళ్లు మూగబోయాయి. దాంతో నెటిజన్లలో అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఇన్నాళ్లు ఫాంగ్ బిన్, షెన్ కిషీలను ఫాలో అవుతూ వచ్చిన వాళ్లంతా ఫాంగ్, షెన్‌ల నుంచి ఎలాంటి సమాచారం లేకపోవ డంతో ఆందోళన చెందుతున్నారు.

ఫాంగ్, షెన్‌లు కనిపించకపోవడంపై చైనా అధికార యంత్రాంగం మౌనం వహించింది. వారిద్దరు ఎక్కడ ఉన్నారో కూడా చెప్పడం లేదు. అసలు బతికే ఉన్నారా లేదా అన్నది కూడా క్లారిటీ ఇవ్వడం లేదు. ఐతే, ఇదేం కొత్తది కాదని, జిన్‌పింగ్ ప్రభుత్వ తీరే ఇంత అని ప్రజలు మండిపడుతున్నారు. నిరసనగళాలు, ఎదురుతిరిగేవాళ్లను ఎప్పటికప్పుడు అణచివేయడం చైనాలో ఎప్పుడూ జరిగే తంతేనని చెబుతున్నారు. 2003లో సార్స్ వైరస్ వణికించిన సమయంలో, 2008లో వాంచువాన్ భూకంపం టైమ్‌లో, 2015లో తియాంజిన్ రసాయనిక పేలుడు సందర్భంలోనూ వాస్తవాలు బయటికి రాకుండా చైనా ప్రభుత్వం కఠినంగా వ్యవహరించింది. ఇప్పుడు, కరోనా వైరస్ తీవ్రస్థాయిలో విజృంభిస్తూ వేలమందిని చంపేస్తున్న సమయంలో ఏ విషయమూ బయటకు రాకుండా చైనా సర్కారు జాగ్రత్తలు తీసుకుంది. వైరస్ గురించి డిసెంబర్ మొదటి వారంలోనే హెచ్చరించిన ఓ డాక్టర్‌ను పోలీసులు హెచ్చరించారు. ఆ తర్వాత అదే డాక్టర్, కరోనా వైరస్‌కు బలయ్యారు. ఆయన మరణంపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. వాటన్నింటినీ ప్రభుత్వం క్షుణ్ణంగా సెన్సార్ చేసింది.

ఇదిలా ఉంటే, కరోనా మృతుల సంఖ్య 17 వందలు దాటేసింది. ఆదివారం ఒక్కరోజే 142 మంది చనిపోయారు. వైరస్ సోకినవారి సంఖ్య 75 వేలకు చేరుకుంది. ఐతే, వైరస్ సోకుతున్నవారి సంఖ్య కొద్ది కొద్దిగా తగ్గుతోంది. శనివారం వరకు 9, 500 మంది పేషంట్లు కోలుకున్నారని ఉన్నతాధికారులు తెలిపారు. శనివారం ఒక్కరోజే 13 వందల మంది తమ ఇళ్లకు వెళ్లారని అధికారులు వెల్లడించారు. దేశం లోని మిగతా ప్రాంతాల్లోనూ కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టిందన్నారు.

కరోనా కట్టడికి చైనా ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోంది. తాజాగా, కరెన్సీ నోట్లపై దృష్టి సారించింది. కరెన్సీ నోట్ల ద్వారా వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉండటంతో వాటిని తాత్కాలికంగా నిల్వ చేయడం ప్రారంభించారు. ఆస్పత్రులు, తడి మార్కెట్ల నుంచి వచ్చే నోట్లను సేకరిస్తున్నారు. యూవీ కిరణాల ద్వారా శుభ్రపరిచిన తర్వాతే ఆ నోట్లను మళ్లీ వినియోగిస్తున్నారు. వైరస్ ప్రభావం బాగా ఉన్న ప్రాంతాల్లో బ్యాంకుల నుంచి నగదు సరఫరాను నిలిపివేశారు. నగదు బదులు ఆన్‌లైన్ బ్యాంకింగ్ సర్వీసులు ఉపయోగించుకోవాలని సూచించారు. ఇక, హూబే ప్రావిన్స్‌ కు 4 బిలియన్ యువాన్ల కొత్త నోట్లను సరఫరా చేశారు.

బ్రిటన్‌లోనూ కరోనా వైరస్ కలకలం రేపుతోంది. లండన్‌లోని చైనా టౌన్‌ రాత్రికి రాత్రి ఖాళీ అయిపోయింది. మనుష్య సంచారం లేక వీధులు, కస్టమర్లు కానరాక హోటళ్లు, రెస్టారెంట్లు, దుకాణాలు వెలవెలబోతున్నాయి. లండన్‌లో ఓ మహిళకు కరోనా వైరస్‌ సోకినట్లు నిర్ధారణ కావడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. లండన్‌లో అదే తొలి కేసు. మొత్తంగా బ్రిటన్‌లో 9 కేసులు నమోదయ్యాయి. వైరస్‌ సోకిన బాధితురాలిని దక్షిణ లండన్‌లోని గయ్య్‌ అండ్‌ సెయింట్‌ థామస్‌ ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. మరో 8 వందల మంది బ్రిటిషర్లకు వైద్య పరీక్షలు నిర్వహించగా ఎవరికీ వైరస్‌ సోకలేదని తేలింది. అయినప్పటికీ చైనా టౌన్‌లో ప్రజలు ఇళ్లు కదలడం లేదు. జనసమర్ధంగా ఉండే హోటళ్లు, షాపులు, ఇతర పబ్లిక్‌ స్థలాలకు వెళ్లడం లేదు.

Tags

Read MoreRead Less
Next Story