కరీంనగర్ కాకతీయ కెనాల్ ప్రమాదాలకు కేరాఫ్ అడ్రస్ గా మారింది

రాజీవ్ రహదారి తరుచూ రక్తసిక్తమవుతోంది. కరీంనగర్ కాకతీయ కెనాల్ ప్రమాదాలకు కేరాఫ్ అడ్రస్ గా మారింది. ఆ ప్రాంతంలో నిత్యం ఏదో ఒక ప్రమాదం చోటు చేసుకుంటోంది. బ్రిడ్జిపై నుంచి కారు మానేరులో పడిన ఘటన మరవకముందే.. మరో ఘటన చోటుచేసుకుంది. ఓ ద్విచక్ర వాహనదారుడు అదుపు తప్పి కాకతీయ కెనాల్ లో పడిపోయాడు. స్థానికులు వెంటనే స్పందించడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. అయితే, అతని భార్య కీర్తన నీటిలో కొట్టుకుపోయింది. వెంటనే స్పందించిన పోలీసులు కాకతీయ కెనాల్ గేట్లను మూసివేసి గాలింపు చేపట్టారు. రాత్రి సమయంలో కీర్తనను విగతజీవిగా గుర్తించారు. అయితే, నీటి సరఫరా ఆపివేయడంతో మరో విషాద ఘటన వెలుగుచూసింది.

రాజీవ్ రహదారికి కిలోమీటర్ దూరంలో యాదవుల పల్లి వద్ద.. కాకతీయ కెనాల్ లో మరో కారును గుర్తించారు పోలీసులు. ఆ కారులో మూడు మృతదేహాలు బయటపడ్డాయి. 15 నుంచి 20 రోజుల క్రితం రాత్రి వేళ కారు కాకతీయ కెనాల్లో పడినట్టుగా భావిస్తున్నారు. క్రేన్ సహాయంతో కారును వెలికి తీశారు. కారు వెనుక సీటులో కుళ్ళిపోయిన స్థితిలో ఇద్దరు స్త్రీ మృతదేహాలు. ఒక పురుషుడి మృతదేహం బయటపడ్డాయి. ప్రమాదం జరిగినప్పుడు వారంతా బయటపడేందుకు యత్నించినట్టుగా అర్థమవుతుంది. అయితే.. కారు సెంట్రలైజ్డ్ లాక్ కావడంతో ఈజీగా ఓపెన్ కాలేదు. వారు నీటిలో మునిగి తుదిశ్వాస విడిచినట్టుగా తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులకు ఆశ్చర్యకరమైన విషయాలు తెలిశాయి. ఆ మృతదేహాలను ఇరవై రోజుల నుంచి కనబడకుండాపోయిన కరీంనగర్ కు చెందిన ఫ్యామిలీగా పోలీసులు గుర్తించారు. దీంతో కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. అంతేకాదు, మృతులు పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌ రెడ్డి చెల్లెలు రాధ, బావ సత్యనారాయణ రెడ్డి, కోడలు వినయశ్రీగా గుర్తించారు.

గత జనవరి 27న భార్య రాధ, కూతురు వినయశ్రీతో హైదరాబాద్ బయల్దేరిన నారెడ్డి సత్యనారాయణ రెడ్డి.. అప్పటి నుండి కనించకుండా పోయారు. దీని పై బంధువులు కూడా పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు చేయలేదు. వారంతా తరుచూ టూర్లకు వెళ్తుండటమే ఇందుకు కారణం. దీంతో వారు ఎప్పటిలాగే టూర్ లో వున్నారని బంధువులు భావించారు. అయితే ఇలా ప్రమాదానికి గురై మృతిచెందడంతో.. వారి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

సంఘటనా స్థలాన్ని కరీంనగర్ కలెక్టర్ శశాంక, పోలీస్ కమీషనర్ కమలాసన్ రెడ్డి సందర్శించి పరిస్థితిని పర్యవేక్షించారు. ప్రస్తుతానికి ప్రమాదం జరిగిన తీరు తెలియరానప్పటికీ.. దీనిపై విచారణ చేపడుతామని కమీషనర్ కమలాసన్ రెడ్డి స్పష్టం చేశారు. ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి కూడా సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మృతదేహాలు కుళ్ళిపోయిన స్థితిలో ఉండి.. తరలించే అవకాశం లేకపోవడంతో అక్కడే పంచనామా, పోస్ట్ మార్టమ్ నిర్వహించారు అధికారులు.

అటు, నారెడ్డి సత్యనారాయణ రెడ్డి బంధువులు సంఘటనా స్థలానికి చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపించారు. దీంతో సంఘటన స్థలంలో విషాదం నెలకుంది. అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. ప్రమాదంగా కేసును నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Tags

Read MoreRead Less
Next Story