కేసీఆర్ 66వ పుట్టిన రోజు వేడుకలు

కేసీఆర్ 66వ పుట్టిన రోజు వేడుకలు

ముఖ్యమంత్రి కల్వకుంట్ర చంద్రశేఖర్రావు 66వ పుట్టిన రోజు వేడుకలకు తెలంగాణ సిద్ధమైంది. హైదరాబాద్‌లోని జలవిహార్‌లో వుయ్‌ లవ్‌ కేసీఆర్‌ పేరుతో బర్త్ డే సెలబ్రేషన్స్ నిర్వహించనున్నారు. ఇక్కడి ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ ఇప్పటికే వీ లవ్ కేసీఆర్ లోగోను కూడా ఆవిష్కరించారు.

కేసీఆర్ జన్మదినం సందర్భంగా ఉదయం బల్కంపేట ఎల్లమ్మ గుడి దగ్గర మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టనున్నారు. జలవిహార్ లో కూడా హరితహారం, హెల్త్ క్యాంప్, ఫోటో ఎగ్జిబిషన్‌ ఏర్పాటు చేయనున్నారు. నెక్లెస్ రోడ్డులో భారీ కేక్‌ కట్ చేయనున్నారు. కేసీఆర్‌కు శుభాకాంక్షలు తెలుపుతూ సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహించనున్నారు. మంత్రులు, ఎంపీలు, గ్రేటర్ ఎమ్మెల్యేలు అంతా ఈ జన్మదిన వేడుకల్లో పాల్గొంటారు. గ్రేటర్ వాసులు సైతం కేసీఆర్ జన్మదినం సందర్భంగా పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని మంత్రి తలసాని పిలుపు ఇచ్చారు.

అటు మంత్రి కేటీఆర్ కూడా కేసీఆర్ పుట్టిన రోజున ప్రతి ఒక్కరు ఒక మొక్కనాటి సీఎం శుభాకాంక్షలు తెలపాలని పిలుపునిచ్చారు. అధికారులు కూడా మొక్కలు నాటే కార్యక్రమాల్లో పాల్గొనాలని అన్నారు. మరోవైపు కేసీఆర్‌పై తమకున్న అభిమానాన్ని అద్వితీయ రీతిలో చాటుకున్నారు.. గజ్వేల్‌ వాసులు. కేసీఆర్‌ 66 వ పుట్టినరోజు సందర్భంగా.. 2 వేల 600 మంది.. 2వేల 600 మొక్కలను చేతిలో పట్టుకుని కేసీఆర్‌ చిత్రం ఆకారంలో నిలబడ్డారు. 66 వేల చదరపు ఫీట్ల ఖాళీ స్థలంలో చేసిన ఈ విన్యాసం అందరినీ విశేషంగా ఆకట్టుకుంది.

ముఖ్యమంత్రి కేసీఆర్‌ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితుడైన ఓ వీరాభిమాని ఆయన విగ్రహాన్ని తయారు చేయించారు. కరీంనగర్‌ జిల్లా చిగురుమామిడి మండలం కొండాపూర్‌ గ్రామానికి చెందిన బత్తుల వెంకటేష్‌ లక్ష వెచ్చించి కేసీఆర్‌ విగ్రహాన్ని తయారు చేయించారు. కేసీఆర్‌ పుట్టిన రోజు సందర్భంగా సోమవారం ఆవిష్కరించనున్నట్లు వెల్లడించారు. ఇక అయా జిల్లాలోని కలెక్టర్లు, అధికారులతో పాటు నియోజకవర్గాల్లో సీఎం పుట్టిన రోజు సందర్భంగా హరిత హారం చేపట్టనున్నారు. మంత్రుల పిలుపుమేరకు మొక్కలు నాటనున్నారు.

Tags

Next Story