వంతెనపై నుంచి కింద పడిన కారు.. ప్రమాదంపై ఆరా తీస్తున్న కానిస్టేబుల్ సైతం మృతి

కరీంనగర్‌లో ఓ లారీ మృత్యువై దూసుకొచ్చింది. దైవ దర్శనం కోసం వెళ్తున్న దంపతుల పాలిట లారీ యమపాశమైంది. మానేరు వంతనపై నుంచి వెళ్తున్న కారును వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు వంతెన పైనుంచి కిందపడటంతో భర్త మృతిచెందగా.. భార్య తీవ్రంగా గాయపడింది. ప్రమాదం ఎలా జరిగిందని ఆరా తీస్తున్న కానిస్టేబుల్ కూడా అదుపు తప్పి వంతెనపై నుంచి కిందపడ్డాడు. తీవ్రంగా గాయపడిన అతడిని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.
గంగాధర మండలం ఉప్పర మల్యాల ప్రభుత్వ పాఠశాలలో శ్రీనివాస్ స్కూల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు. ఆదివారం సెలవు కావడంతో కొమురవెల్లి మల్లికార్జునస్వామి దర్శనం కోసం భార్యతో కలసి ఉదయం 9 గంటలకు కారులో ఇంటి నుంచి బయల్దేరారు. కారు మానేరు వంతెనపైకి చేరుకున్న సమయంలో కరీంనగర్ నుంచి వస్తున్న లారీ కారును వెనుక నుంచి వేగంగా ఢీకొట్టింది. దీంతో కారు అదుపు తప్పి మానేరు వంతెన రెయిలింగ్‌ను ఢీకొని కిందపడింది. సుమారు 200 మీటర్ల ఎత్తు నుంచి కింద ఉన్న బండరాళ్లపై పడడంతో కారు నడుపుతున్న 40 ఏళ్ల శ్రీనివాస్ అక్కడికక్కడే మృతి చెందాడు. అతడి భార్య స్వరూప తీవ్రంగా గాయపడింది.
ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే కరీంనగర్, ఎల్‌ఎండీ పోలీసులకు సమాచారం అందించారు. కరీంనగర్–1 టౌన్ కానిస్టేబుల్ చంద్రశేఖర్ ప్రమాద స్థలానికి చేరుకొని ట్రాఫిక్ ను నియంత్రించే క్రమంలో అదుపుతప్పి వంతెన పైనుంచి కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు. 108లో స్వరూప, చంద్రశేఖర్‌ను కరీంనగర్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ చంద్రశేఖర్ మృతి చెందాడు. సంఘటన స్థలాన్ని మంత్రి గంగుల కమలాకర్, సీపీ కమలాసన్‌రెడ్డి, కరీంనగర్ మున్సిపల్ కమిషనర్ క్రాంతి సందర్శించారు. ప్రమాదంపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

