దిగొచ్చిన టెలికాం సంస్థలు

టెలికం సంస్థలు దిగొచ్చాయి. సుప్రీంకోర్టు ఆగ్రహం, కేంద్రం డెడ్‌లైన్ నేపథ్యంలో టెల్కో కంపెనీలు మొండిపట్టు వీడాయి. ప్రభుత్వానికి బకాయి పడిన మొత్తాన్ని చెల్లించడానికి అంగీకరించాయి. టెలికం దిగ్గజం భారతీ ఎయిర్ టెల్ 10 వేల కోట్ల రూపాయలను టెలికంశాఖకు చెల్లించింది. భారతి ఎయిర్‌టెల్, భారతి హెక్సాకామ్, టెలినార్‌ల తరపున 10 వేల కోట్లు చెల్లించామని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. మిగిలిన మొత్తాన్ని కూడా త్వరలోనే చెల్లిస్తామని.. ఎంత చెల్లించాలనే అంశంపై మదింపు చేస్తున్నామని వెల్లడించారు. సుప్రీంకోర్టు తదుపరి విచారణలోపు మిగిలిన బకాయిలను పేచేస్తామని వివరించారు.
భారతి ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా సహా పలు టెలికం కంపెనీలు కేంద్రానికి భారీగా బకాయిపడ్డాయి. దాదాపు లక్ష 40 వేల కోట్ల రూపాయల మేర బాకీ ఉన్నాయి. ఇందులో ఎయిర్‌టెల్ ఒక్కటే 35 వేల 586 కోట్లు బాకీ పడింది. లైసెన్స్ ఫీజు, స్పెక్ట్రం వాడకం చార్జీలు సహా వివిధ రకాల బకాయిలు ఇందులో ఉన్నాయి. ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. బకాయిలు మొత్తం చెల్లించాలంటూ టెల్కోలను ఆదేశించింది. సొమ్ము కట్టకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో కేంద్రం కూడా రంగంలోకి దిగింది. వెంటనే 92 వేల కోట్లు కట్టాలని ఆదేశించింది. దాంతో ఎయిర్‌టెల్ స్పందించింది. ఫిబ్రవరి 20లోపు 10 వేల కోట్లు చెలిస్తామని.. మార్చ్ 17లోపు మిగిలిన మొత్తం చెల్లిస్తామని తెలిపింది.
© Copyright 2023 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com