రాజీవ్ స్వగృహ ఇళ్లను వేలం ద్వారా అమ్మేయాలని తెలంగాణ కేబినెట్ నిర్ణయం

రాజీవ్ స్వగృహ ఇళ్లను వేలం ద్వారా అమ్మేయాలని తెలంగాణ కేబినెట్ నిర్ణయం

పల్లె ప్రగతి ఫలితాలతో ఇక పట్టణ ప్రగతికి శ్రీకారం చుట్టబోతోంది రాష్ట్ర ప్రభుత్వం. ఈ నెల 24 నుంచి 10 రోజుల పాటు రాష్ట్రంలోని అన్ని పట్టణాలు, నగరాల్లో పట్టణ ప్రగతి కార్యక్రమం నిర్వహించాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది. పట్టణ ప్రగతికి సన్నాహకంగా ఈ నెల 18న ప్రగతిభవన్ లో రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహించి విధివిధానాలపై చర్చించనుంది. మేయర్లు, మున్సిపల్ చైర్ పర్సన్లు, కమిషనర్లు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లను ఈ సమావేశానికి ఆహ్వానించనున్నారు. ఈ సదస్సులో పాల్గొన్న వారందరినీ అదే రోజు మధ్యాహ్నం సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో నిర్మించిన వెజ్-నాన్ వెజ్ మార్కెట్ ను, స్మశాన వాటికలను సందర్శించడానికి తీసుకెళతారు.

రాష్ట్రంలో చక్కని నగర జీవన వ్యవస్థపై పయనం సాగడమే లక్ష్యంగా పట్టణ ప్రగతితో మంచి పునాది ఏర్పడాలన్నారు ఆశాభావం వ్యక్తం చేశారు సీఎం. ప్రణాళికాబద్ధమైన ప్రగతి జరగాలని మంత్రులకు దిశానిర్దేశం చేశారు. GHMCకి నెలకు రూ.78 కోట్ల చొప్పున, రాష్ట్రంలోని ఇతర మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు నెలకు రూ.70 కోట్ల చొప్పున వెంటనే ప్రభుత్వం ఆర్థిక సంఘం నిధులు విడుదల చేయాలని కేబినెట్ నిర్ణయించింది. వార్డు యూనిట్ గా పట్టణ ప్రగతి జరగాలి. ప్రతీ వార్డుకు ఒక ప్రత్యేక అధికారిని నియమించనున్నారు. ప్రతీ మున్సిపాలిటీ, కార్పొరేషన్ లో వార్డుల వారీగా 4 చొప్పున ప్రజా సంఘాలను ఏర్పాటు చేసే ప్రక్రియ వచ్చే 5 రోజుల్లో పూర్తి కావాలని మంత్రులకు సీఎం సూచించారు.

రాజీవ్ స్వగృహ ఇళ్ళను వేలం ద్వారా అమ్మేయాలని కేబినెట్ నిర్ణయించింది. దీనికి సంబంధించి విధి విధానాలు ఖరారు చేయడానికి చిత్రా రామచంద్రన్ అధ్యక్షతన రామకృష్ణారావు, అరవిందకుమార్ సభ్యులుగా అధికారుల కమిటీని నియమించింది. అభయహస్తం పథకం సమీక్ష బాధ్యతను మంత్రి టి.హరీశ్ రావు, ఐఎఎస్ అధికారి సందీప్ సుల్తానియాలకు అప్పగించింది. అభయహస్తం, బంగారుతల్లి, వడ్డీలేనిరుణం తదితర పథకాల పరిస్థితిని క్షుణ్ణంగా అధ్యయనం చేసి తదుపరి నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించారు. అలాగే అసెంబ్లీ బడ్టెట్ సమావేశాల్లో లోకాయుక్త బిల్లు ప్రవేశ పెట్టాలని కేబినెట్ నిర్ణయించింది.

భారత పౌరసత్వం ఇచ్చే విషయంలో మత పరమైన వివక్ష చూపరాదని రాష్ట్ర కేబెనెట్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. చట్టం ముందు అన్ని మతాలను సమానంగా చూడాలని విజ్ఞప్తి చేసింది. కేరళ, పంజాబ్, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల తరహాలోనే తెలంగాణ అసెంబ్లీలో కూడా CAAకి వ్యతిరేకంగా తీర్మానం చేయాలని కేబినెట్ నిర్ణయించింది.

Tags

Next Story